Thu Mar 12 2026 16:12:10 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : గీత దాటితే వేటు తప్పదట.. కూటమి నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే అంతే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ క్రమశిక్షణ విషయంలో సీరియస్ అయ్యారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ క్రమశిక్షణ విషయంలో సీరియస్ అయ్యారు. ఇటీవల నేతలు వివిధ మాధ్యమాల్లో చేస్తున్న ప్రకటనలను మానుకోవాలని చెప్పినట్లు తెలిసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఇటీవల వివిధ యూ ట్యూబ్ ఛానెళ్లకు జనసేన నేతలు ఇంటర్వ్యూలు ఇస్తూ తమ స్థాయికి మించి వ్యాఖ్యలు చేస్తున్నారని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. జనసేనకు, తనపైన అభిమానంతోనే ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ అది కూటమిలో ఉన్న పార్టీల మధ్య విభేదాలు పొడచూపే అవకాశాలున్నాయని, అందుకే ఎవరూ తమ పరిథిలోని అంశాల గురించి మాట్లాడ వద్దని గట్టి సందేశం పార్టీ నేతలకు అంతర్గతంగా పంపినట్లు తెలిసింది.
కూటమి మధ్య విభేదాలు తలెత్తేలా...
ఇటీవల తిరుపతికి చెందిన కిరణ్ రాయల్ వచ్చే ఎన్నికల్లో జనసేన 70 స్థానాలను ఖచ్చితంగా టీడీపీ నుంచి తీసుకుంటుందని, జనసేన లేకపోతే గత ఎన్నికల్లో టీడీపీ గెలిచేదా? అని ప్రశ్నించారు. 2024 నాటి కంటే జనసేన బలం ఈ రెండేళ్లలో బలం పెరిగిందని, అందువల్ల ఈసారి ఎక్కువ స్థానాలను తీసుకుంటామని కిరణ్ రాయల్ అన్నారు. కిరణ్ రాయల్ వ్యాఖ్యలు కూటమిలో నిప్పును రాజేశాయి. టీడీపీ అనుకూలురు కిరణ్ రాయల్ వ్యాఖ్యలపై మండిపడుతూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. జనసేన బలం ఏంటో తెలుసుకోవాలని, 2019 ఎన్నికల్లో రెండుచోట్ల పవన్ ఓడిపోయిన సంగతి తెలియదా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ లేకుంటే జనసేన ఉండేదా? అని నిలదీస్తున్నారు.
అనవసర వ్యాఖ్యలతో...
ఇలా అనవసర వ్యాఖ్యలతో కూటమిలోని ప్రధాన పార్టీల మధ్య చిచ్చు రేగడంతో పవన్ కల్యాణ్ అప్రమత్తమయ్యారు. కేవలం కిరణ్ రాయల్ ను ఉద్దేశించి మాత్రమే కాకుండా కూటమిలో ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేసినా క్రమశిక్షణ చర్యలుంటాయని పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పాటు మరికొందరు ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు టీడీపీ తమకు పదవుల విషయంలో అన్యాయం చేస్తుందంటూ పోస్టింగ్ లు కూడా ఎక్కువగా కనిపిస్తుండటంతో పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని, అలా మాట్లాడానుకుంటే పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లి మాట్లాడుకోవచ్చని పవన్ కల్యాణ్ గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం.
Next Story

