Wed Jan 07 2026 18:48:16 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : అక్కడా.. ఇక్కడా.. ఎందుకు జానీ... ఏపీ చాలదూ?
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు పడవలపై కాళ్లు పెట్టకూడదు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు పడవలపై కాళ్లు పెట్టకూడదు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి తో అధికారంలోకి వచ్చిన పవన్ కల్యాణ్ తెలంగాణలోనూ పార్టీని విస్తరించాలని భావిస్తున్నట్లు కనపడుతుంది. ఇటీవల కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం పర్యటనలో భాగంగా ఒక రిసార్ట్ లో తెలంగాణ జనసేన నేతలు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. అయితే పవన్ కల్యాణ్ ను అభిమానించే వారు తెలంగాణలో లేరని కాదు. అది సినిమా హీరోగానే అభిమానించేవాళ్లు. అంతే తప్ప రాజకీయంగా ఆయనను ఓన్ చేసుకునే వారు దాదాపుగా లేరనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు,తెలంగాణ పాలిటిక్స్ కు చాలా తేడా ఉంది.
అభిమానం ఓట్లు తేదు....
ఇక్కడ కుల రాజకీయాలు అస్సలు పనిచేయవు. అలాగే సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది. గతంలో జరిగిన అనేక ఎన్నికలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అందుకే వైసీపీ తెలంగాణలో దుకాణం మూసేసింది. తన పార్టీని ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం చేసింది. అసలు జగన్ తెలంగాణ రాజకీయాల్లో వేలు కూడా పెట్టడం లేదు. ఇక కూటమిలో తన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు అదే బాటలో పయనిస్తుంది. తెలంగాణలో టీడీపీ ఇంతవరకూ రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. జగన్, చంద్రబాబును చూసినట్లుగానే పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ వాసిగానే తెలంగాణ ప్రజలు చూస్తారు. అంతే తప్ప తండోపతండాలుగా వచ్చి ఓట్లు గుమ్మరించే సీన్ మాత్రం లేదనే చెప్పాలి.
ఏపీలో పార్టీని బలోపేతం చేసుకుని...
అందుకే ఆంధ్రప్రదేశ్ లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటే మంచిది. పార్టీ పెట్టి ఇన్నేళ్లయినా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన లేదు. ఇది వాస్తవం. అలాంటిది తెలంగాణలో రాజకీయం చేసి చేతులు కాల్చుకోవడం తప్ప మిగిలేది ఏమీ ఉండదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. బహుశ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఇక్కడ పెద్దగా రాజకీయంగా ఒరిగేది లేదు. వచ్చేది లేదు.అందుకే ముందు ఆంధ్రప్రదేశ్ లో పార్టీపై ఫోకస్ పెట్టి వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలిచి ముఖ్యమంత్రి పదవికి దగ్గర దారి ఏర్పరుచుకుంటే మంచిదన్న సూచనలు పవన్ కల్యాణ్ కు కొందరు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. మరి పవన్ చెవికి ఈ మాటలు ఎక్కుతాయో? లేదో? చూడాలి.
Next Story

