Mon Apr 13 2026 15:06:19 GMT+0530 (India Standard Time)
Janasena : పవన్ వ్యూహం నేతలకు అర్థం కానట్లుందిగా?
జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడాలనుకుంటుంది.

జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడాలనుకుంటుంది. అందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇటీవల జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో సమావేశమైన పవన్ కల్యాణ్ ఎక్కువగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఎక్కువగా చర్చించారని చెబుతున్నారు. జనసేనకు తన బలం పెంచుకోవడానికి ఇదే మంచి సమయమని పవన్ కల్యాణ్ యోచిస్తున్నారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం అయితే రానున్న శాసనసభ ఎన్నికల్లోనూ తమకు అనుకూల ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
పట్టణ, నగరాల్లోనే...
జనసేన పార్టీకి వాస్తవానికి పట్టణ, నగర ప్రాంతాల్లోనే బలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అంత పట్టు లేదన్నది వాస్తవం. 2024 జరిగిన ఎన్నికల్లోనూ ఎక్కువగా పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లోనే పోటీ చేసి జనసేన విజయం సాధించింది. అయితే క్షేత్రస్థాయిలో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించుకోవాలన్న పవన్ కల్యాణ్ లక్ష్యం నెరవేరాలంటే అందుకు ఎమ్మెల్యేల సహకారం ఎంతో అవసరం. ఎందుకంటే వారు తమ నియోజకవర్గాల్లో గ్రామీణ స్థాయిలో ఉన్న క్యాడర్ ను కలుపుకుని పోతూ అక్కడ నాయకత్వాన్ని పెంచే బాధ్యతను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది.
గ్రామీణ ప్రాంతంలో జనసేన...
గ్రామీణ ప్రాంతంలో జనసేన పుంజుకుంటే ఓటు బ్యాంకు కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుందని పవన్ కల్యాణ్ భావన. ఇందుకు క్షేత్ర స్థాయిలో నాయకుల సంఖ్య మరింతగా పెరగాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న `ఉద్యమి` సభ్యత్వాలు నమోదు లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ జరగాల్సి ఉంటుంది. కానీ జనసేన ఎమ్మెల్యేలు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారా? అంటే ఒక రకంగా లేదనే చెప్పాలి. అయితే కేవలం ఎమ్మెల్యేలపైనే ఆధారపడితే రానున్న కాలంలో ఇబ్బందులు తప్పవని, అందుకే పవన్ కల్యాణ్ నేరుగా అయినా లేకపోతే మరొక ఇన్ ఛార్జి తోనయినా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయవచ్చంటున్నారు.లక్ష్యాల నిర్దేశించడం వరకు బాగానే ఉన్నప్పటికీ వాటిని సాకారం చేసుకునే విషయంలో తడబాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి పవన్ కల్యాణ్ ఆ దిశగా ప్రయత్నిస్తారా? లేదా? అన్నది చూడాలి.
Next Story

