Sat Feb 07 2026 17:35:55 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : సేనాని సరికొత్త స్కెచ్.. ఇక ప్రత్యర్థులతో ఆట మొదలయినట్లే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రత్యేక దారిలో వెళుతున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రత్యేక దారిలో వెళుతున్నారు. పార్టీని కూడా అదే పంథాలో నడిపించాలని భావిస్తున్నారు. ఎవరున్నా.. ఎవరుపార్టీని వదిలి వెళ్లినా ఎవరిని పెద్దగా లెక్క చేయకుండా తాను నమ్మిన విషయాలతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుంది. డిఫరెంట్ రూట్ లో వెళ్లాలన్నదిపవన్ కల్యాణ్ అభిప్రాయంగా ఉంది. అందుకే ఆయన జనసేన నేతలు ఏ స్థాయిలో ఉన్నా క్లాస్ లు పీకుతున్నారు. ఇటీవల పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ఆగ్రహం వెనక కూడా అదే కారణమని అంటున్నారు. కొందరు నేతలు గాడి తప్పుతుండటం, విపక్షాల విమర్శలకు సమాధానం చెప్పకపోవడం, సొంత పనుల్లోనే నిమగ్నమై ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడానికే పవన్ కోపానికి కారణమని పార్టీ నేతలు చెబుతున్నారు.
పన్నెండేళ్లు దాటిపోవడంతో...
జనసేన పార్టీని పవన్ కల్యాణ్ పెట్టి దాదాపు పన్నెండేళ్లు దాటి పోయింది. ఈ పదేళ్లలో ఎందరో నమ్మకమైన నేతలు తనను వీడి వెళ్లిపోయారు. తన మార్గం నుంచి ఆయన మాత్రం బయటకు రాలేదు. అందుకే తాను ఇరవై ఐదేళ్ల రాజకీయాలకు సిద్ధపడి వచ్చానని తరచూ చెబుతుంటారు. తనతో ఉన్న వారే నేతలవుతారని, వెళ్లిపోయిన వారు వెళ్లిపోవచ్చని నిర్మొహమాటంచెప్పే పవన్ కల్యాణ్ పార్టీ మొత్తం ఆధారపడింది తనమీదేనని తెలుసు. తాను ఏ మాత్రం బలహీనతను ప్రదర్శించిన నేతలు మరింత రెచ్చిపోయే అవకాశముందని భావించి ఈ రకమైన చర్యలకు దిగుతున్నారన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల విషయంలోనూ పవన్ కల్యాణ్ నిఘా పెట్టినట్లు సమాచారం. గత ఎన్నికలకు ముందు కొందరిని తప్పనిసరి స్థితిలో పార్టీలో చేర్చుకోవాల్సి వచ్చింది. అయితే వారి పనితీరును కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారంటుననారు.
స్థానిక సంస్థల ఎన్నికల నాటికి...
ఇక రానున్న కాలంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే పనిలో ఉన్నారు. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే రాజకీయంగా బలపడాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జనసేకు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలతో పాటు అనేక మంది కార్పొరేషన్ పదవుల్లో కూడా ఉన్నారు. అందులో భాగంగా ఈ ఏడాది మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈలోపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే కాకుండా పార్టీ పదవులను కూడా గ్రామ, వార్డు స్థాయిలో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆరోపణలు శృతిమించడంతో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని తిరిగి పునరుద్ధరించాలని కూడా నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పవన్ కల్యాణ్ పార్టీని బలోపేతం చేసి ఎన్నికలలో మంచి విజయం సాధించాలని చూస్తున్నారు. మరి ఆయన వ్యూహాలు ఏ మేరకు పనిచేస్తాయో చూడాలి.
Next Story

