Wed Dec 31 2025 09:46:51 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : గుడ్డి నమ్మకంతో ఉంటే చివరకు మిగిలేది గుండు సున్నాయే అన్నా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఏడాది అనేక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఏడాది అనేక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. కూటమి లో ఉంటే గెలుపు గ్యారంటీ అని గుడ్డి నమ్మకంతో ఉంటే లాభం లేదన్న విశ్లేషణలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ అభిమానుల విషయంలో ఆయన పట్ల సానుకూలత చెక్కు చెదరలేదు కానీ, కాపు సామాజికవర్గంలో పవన్ నాయకత్వం పట్ల భిన్నమైన వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపు సామాజికవర్గానికి ప్రత్యేకంగా జరిగిన లాభమేంటన్న ప్రశ్న మాత్రం వారిలో మొదలయిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజికవర్గం బలంగా ఉన్న తూర్పు, పశ్చి మ గోదావరి జిల్లాల్లోనే చాలా వరకూ అసంతృప్తి కనిపిస్తుంది.
ఆశలు లేకుండానే...
మరొకవైపు రాయలసీమలో ఉన్న బలిజల్లో కూడా పవన్ నాయకత్వంపై పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. ఈ రెండేళ్లు పవన్ కల్యాణ్ ను ఉప ముఖ్యమంత్రిగా మాత్రమే వారు చూశారు. వారు బలంగా కోరుకున్నది ముఖ్యమంత్రి కావాలనుకున్నది. కానీ మరో పదిహేనేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారంటూ పవన్ పదే పదే వ్యాఖ్యానిస్తూ వారి కలలపై నీళ్లు చల్లారు. చివరకు కాపు సంక్షేమ సేన హరిరామ జోగయ్య సయితం పవన్ కల్యాణ్ కు, చంద్రబాబుకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని లేఖ రాశారంటే అది ఆయన ఒక్కరి ఆలోచన కాదన్నది పవన్ కల్యాణ్ గుర్తుంచుకోవాలి. అది కాపులలో కలుగుతున్న మనోభావాలకు రాసిన ఉత్తరమని గుర్తించగలిగితే మేలు చేకూరుతుందని అంటున్నారు.
క్షేత్రస్థాయిలో బలం లేని...
మరొకవైపు ఇప్పటి వరకూ క్షేత్రస్థాయిలో జనసేన బలపడలేదు. కేవలం అభిమానులు, సామాజికవర్గం పరంగానే బూత్ లెవెల్లో నాయకులు కానీ, కార్యకర్తలు కానీ నిలబడి ఉన్నారు. వారిలో అసంతృప్తి తలెత్తితే చివరకు ఇబ్బందులు తప్పవు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల పనితీరు కూడా సంతృప్తికరంగా లేదు. అలాగే టీడీపీ అధికారంలో ఉన్న నియోజకవర్గాల్లో జనసేన క్యాడర్ ను కూడా పట్టించుకోవడం లేదు. తాను అనుకున్నదే చేస్తానని, ఎవరి అభిప్రాయాలు తనకు అవసరం లేదనుకుంటే చివరకు 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశాలున్నాయి. అందుకే పవన్ కల్యాణ్ కొత్త ఏడాదిలోనైనా నియోజకవర్గాల్లో క్యాడర్ తో పాటు జనసేన నేతలను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Next Story

