Wed Feb 25 2026 14:59:38 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : గోల్ లేకపోతే ఎలా? ఎప్పటికీ ఇంతేనా? పవన్ పై పాజిటివిటీ పోయిందా?
పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ జనసేనను ఒక వ్యూహం ప్రకారం తీసుకెళుతున్నారు

పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ జనసేనను ఒక వ్యూహం ప్రకారం తీసుకెళుతున్నారు. 2014లో పార్టీని స్థాపించినా 2024లో ఆయన స్ట్రాటజీని మార్చుకున్నారు. తనకున్న కుల బలంతోనే ఆయన రాజకీయాలు చేయలేమని భావించారు. అన్ని కులాలు, వర్గాల మద్దతు కావాలని అనుకున్నారు. రాజకీయాల్లో మార్పు కోసం వచ్చినట్లు పవన్ కల్యాణ్ ఎప్పుడూ ప్రకటిస్తారు. అందుకే 2024లో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేనను అధికారంలోకి తేగలిగారు. భవిష్యత్ అనేది ఎవరూ చెప్పలేం. ముఖ్యమంత్రి అనేది మనకున్న బలం సరిపోదన్నది పవన్ కల్యాణ్ వాదన. అయితే హోప్ అయితే ఉండాలి కదా? అని కాపు సామాజివకర్గం నేతల భావన. ముఖ్యమంత్రి పదవి కాకుండా ఎన్నాళ్లు ఇలా డిప్యూటీగా ఉంటారన్న ప్రశ్న కూడా కాపు నేతల నుంచి వినిపిస్తుంది.
రాజకీయాలు దేనికంటూ...
రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఒక గోల్ అనేది ఉండాలి కదా? అని నెట్టింట కొందరు నేరుగా ప్రశ్నిస్తున్నారు. గోల్ లేనప్పుడు రాజకీయాలు చేయడం దేనికి? ఒక వర్గం ఓటు బ్యాంకును తీసుకెళ్లి మరొక పార్టీని అధికారంలోకి తీసుకు రావడం ఎందుకన్న భావన మొదలయినట్లు కనపడుతుంది. పవన్ కల్యాణ్ కు 2014 నుంచి పాజిటివ్ వేవ్ తో పాలిటిక్స్ లో వచ్చారు. ఆయనకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. ప్రధానంగా కాపు సామాజికవర్గం నేతలతో పాటు యువకులు, ఆయనకున్న ఇమేజ్, అభిమానులు కూడా కలసి ఆయన మీద మాట పడనిచ్చే వారు కాదు. పవన్ ను ఒక్క మాటంటే వెంటనే విమర్శలతో తిప్పికొట్టేవారు. అలా పవన్ పై ఏ మాట పడకుండా చూసుకున్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత...
కానీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చింది. రెండేళ్ల తర్వాత చూస్తే మరింత ఎక్కువగా కనిపిస్తుంది. పవన్ పై పాజిటివిటీ పోయిందని అనుకోవాల్సి ఉంటుంది. పవన్ కల్యాణ్ అంటే ఆగ్రహం.. కోపం లేదు కానీ నిర్లిప్తత అయితే కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా ఏం మాట్లాడలేకపోతున్నారనే భావన ఎక్కువ మందిలో కనిపిస్తుంది. కనీసం కాపు రిజర్వేషన్ల అమలుపై మాట్లాడకపోవడం, కాపు కార్పొరేషన్ కు నిధుల కేటాయింపుపై పెదవి విప్పకపోవడం వంటివి ఆయనపై వ్యతిరేకత నెమ్మదిగా మొదలవుతుందని చెప్పాలి. ఇందుకు సోషల్ మీడియాలో అదే సామాజికవర్గం నేతలు, విశ్లేషకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని చూసైనా పవన్ కొంత తీరు మార్చుకుంటే వచ్చే ఎన్నికల్లోకూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ తో జనసేనను తీసుకెళ్లవచ్చు. లేకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు మాత్రం బలంగా కనిపిస్తున్నాయి.
Next Story

