Sat Mar 07 2026 14:16:36 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : పవన్ ఆలోచనల్లో మార్పు లేనట్లుందిగా
పవన్ కల్యాణ్ నిర్ణయాలు.. ప్రసంగాలు జనసైనికులతో పాటు ఆయనను అభిమానించే వారిని సయితం కొంత ఆందోళనలోకి నెడుతున్నాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయాలు.. ప్రసంగాలు జనసైనికులతో పాటు ఆయనను అభిమానించే వారిని సయితం కొంత ఆందోళనలోకి నెడుతున్నాయి. పవన్ కల్యాణ్ ఈసారి కూడా రాజీ ధోరణిని అవలంబిస్తారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నిన్న ఏపీ శాసనసభలో మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో కాపు సామాజికవర్గం నేతలే ట్రోల్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఆలోచనల్లో ఎటువంటవి మార్పు లేదని, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికే ఫిక్స్ అయిపోయారని అంటున్నారు. అంతేకాదు.. ప్రభుత్వ భాగస్వామ్యంలో తాను ఉండాలని కోరుకుంటున్నారే తప్ప అధికారాన్ని ఆశించడం లేదన్నది ఆయన మాటలను బట్టి వ్యక్తమవుతుందంటున్నారు.
ముప్ఫయి ఏళ్ల పాటు కూటమి...
మరో ముప్ఫయి ఏళ్ల పాటు కూటమి కలసి ఉంటేనే రాష్ట్రం పురోగతి సాధిస్తుందని ఆయన నిన్న అసెంబ్లీ లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. కూటమి కలసి ఉండటం వరకూ ఓకే. అంతే తప్ప పాలన పగ్గాల విషయంలోనూ, సీట్ల కేటాయింపు విషయంలోనూ ఆయన ఈసారి కూడా రాజీ ధోరణి అవలంబించే అవకాశాలున్నాయని అసెంబ్లీలో ఆయన ప్రసంగాన్ని చూసిన వారు అంచనా వేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకునేలా కనిపిస్తుందని, అలాగే ఎక్కువ సీట్లు తీసుకుని కొన్ని చోట్ల ఓటమి పాలయ్యేకంటే తక్కువ సీట్లు తీసుకుని ఈసారి కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ ను సాధించడం లక్ష్యంగా పవన్ కల్యాణ్ పనిచేస్తున్నట్లు కనిపిస్తుందని కొందరు నేరుగా పోస్టులు పెడుతున్నారు.
రెండేళ్లలోనూ అసంతృప్తి...
అయితే ప్రజలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో అసంతృప్తిలో ఉన్నారని కూడా ఆయన పరోక్షంగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పుకోలేకపోతున్నామని, వైసీపీ ఎమ్మెల్యేలు పదకొండు మంది ఉన్నా... పదకొండు వందల మందితో సమానమని, వారు చెప్పే మాటలనే ప్రజలు విశ్వసిస్తున్నారని అంటున్నారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలోనూ పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో పథకాల అమలు ప్రచారాన్ని చేయకుండా ఉన్నందునే ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉందని అన్నారు. ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టినా, ఎన్ని సంక్షేమీ కార్యక్రమాలు అమలు చేసినా, ప్రజల్లో సంతృప్తి కనిపించడం లేదని ఆయనే అన్నారు. మరి కూటమిగా ఉంటూ వీటిని ఎలా అధిగమించాలన్న దానిపై దృష్టి పెట్టాలని, అదే సమయంలో తనను నమ్ముకున్న నేతలకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించాలని నెట్టింట కోరుతున్నారు.
Next Story

