Fri Dec 05 2025 09:56:51 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ ప్లాన్ మార్చినట్లుందిగా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి కూటమి ప్రభుత్వంలో పదవులను యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో ఆయన ఉన్నట్లు కనపడుతుంది. ఈసారి గతం కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి ఆయన సన్నద్ధమవుతున్నారు. అందుకే వరసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. తనకున్న ఇమేజ్ తో పాటు పార్టీ బలగాన్ని కూడా పెంచుకుంటే నియోజకవర్గాలను వీలయినన్ని ఎక్కువ సంఖ్యలో తీసుకుని ప్రభుత్వంలో బలంగా మారేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యవహరశైలితో కనపడుతుంది.
తన పని తాను చేసుకుంటూ పోతూనే...
మౌనంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉప ముఖ్యమంత్రిగా జిల్లాలతో పాటు జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో ఈసారి ఖచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి మొదలు పెడితే కానీ అప్పటికి అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు నమ్మకమైన నేతలు, క్యాడర్ మెచ్చిన లీడర్లు దొరకరు. అందుకోసం పవన్ కల్యాణ్ నియోజకవర్గాల వారీగా నివేదికలను తెప్పించుకుని తనకు సమయం దొరికినప్పుడల్లా వాటిని అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు మాత్రమే కాకుండా కోస్తా జిల్లాలు, రాయలసీమలోని చిత్తూరు జిల్లాలోనూ పాగా వేయాలని చూస్తున్నారు.
విభేదాల పరిష్కారానికి...
అందుకు అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించారు. అందుకే ముందుగా పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు చెక్ పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇందుకోసం విభేదాలను పరిష్కరించడానికి పదకొండు మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వారే విభేదాలను పరిష్కరించుకుని ఆ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వంపై ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా అది ప్రధాన పక్షమైన టీడీపీపై పడుతుందని, జనసేనపై తక్కువ ప్రభావం చూపుతుందని ఆయన అంచనా వేస్తున్నట్లుంది. అందుకే ఏ విషయంలోనూ పెద్దగా స్పందించకుండా తన శాఖల విషయంలోనే ఆయన ఎక్కువగా స్పందిస్తున్నారు. మరొకవైపు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి 2029 ఎన్నికల నాటికి పవన్ వ్యూహం ఏ మేరకు పనిచేస్తుందన్నది చూడాలి.
Next Story

