Thu Jan 01 2026 05:12:26 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : గిరిజన మహిళలకు పవన్ న్యూ ఇయర్ గిఫ్ట్
గిరిజన మహిళలకు నూతన సంవత్సరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు

గిరిజన మహిళలకు నూతన సంవత్సరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. గిరిజన మహిళల్లో గర్భస్రావాలు, రక్తహీనత తదితర రుగ్మతలకు కారణమవుతున్న సికిల్ సెల్ ఎనేమియా నుంచి రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ చొరవతో అరకు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో బ్లడ్ బ్యాంక్ భవనం ఏర్పాటు కానుంది. గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుకగా నిర్మించనున్న ఈ బ్లడ్ బ్యాంకు భవనంలో అవసరాలకి అనుగుణంగా రక్తం నిల్వ చేసుకునేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. పవన్ కళ్యాణ్ చొరవతో.. దాతల సహకారంతో నిర్మించనున్న ఈ భవనాన్ని నిర్మాణం అనంతరం అరకు ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానిస్తారు.
నాడు మాట ఇచ్చి...
అడవితల్లి బాట కార్యక్రమం ప్రారంభోత్సవానికి వెళ్లిన సందర్భంలో కురిడీ గ్రామంలో నిర్వహించిన మాటా మంతి కార్యక్రమంలో ఓ మహిళ సికిల్ సెల్ ఎనేమియా కారణంగా గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. జన్యుపరంగా వచ్చే ఈ రుగ్మత గర్భిణుల ఉసురు తీస్తోందని వివరించారు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతానని ఆనాడు మాటిచ్చారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న పవన్ కళ్యాణ్ సికిల్ సెల్ ఎనేమియా నివారణ ఎలా? అనే అంశంపై వైద్య నిపుణులతో పలు సందర్భాల్లో చర్చించారు. వారసత్వంగా వచ్చే ఈ వ్యాధి తీవ్రత రక్తమార్పిడి ద్వారా తగ్గించే అవకాశం ఉందన్న వారి సూచన మేరకు - నూతన సంవత్సర కానుకగా బ్లడ్ బ్యాంకు భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 1,500 మంది సికిల్ సెల్ ఎనేమియా బాధితులకు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఉపశమనాన్ని ఇవ్వనుంది.
Next Story

