Wed Apr 15 2026 14:47:25 GMT+0530 (India Standard Time)
TDP : పరిటాల vs లోకేశ్.. సోషల్ మీడియాలో ఈ వార్ ఏంది గురూ?
తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై పరిటాల వర్గీయులు భగ్గుమంటున్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై పరిటాల వర్గీయులు భగ్గుమంటున్నారు. ఇటీవల నారా లోకేశ్ పరిటాల శ్రీరామ్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని చెప్పడంతో వారి నుంచి సోషల్ మీడియాలో పెద్దయెత్తున వ్యతిరేకంగా పోస్టులు కనపడుతున్నాయి. పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గం ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే అక్కడ గ్రీవెన్స్ డే నిర్వహించకపోవడాన్ని నారా లోకేశ్ తప్పుపట్టారు. కేంద్ర పార్టీ కార్యాలయం ఇచ్చిన నివేదికను అనుసరించి లోకేశ్ గ్రీవెన్స్ డే ను నిర్వహించని వారందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వాలని తెలిపారు. అందులో కడప ఎమ్మెల్యే మాధవి, పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జి బీటెక్ రవితో పాటు పరిటాల శ్రీరామ్ కూడా ఉన్నారు. వీరందరికీ నోటీసులు ఇవ్వాలని నారా లోకేశ్ పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.
ఎందుకు ఇస్తారంటూ?
అయితే అదే పరిటాల వర్గీయుల్లో కడుపు మంటకు కారణమందని చెప్పాలి. పరిటాల శ్రీరామ్ కు షోకాజ్ నోటీసులు ఎందుకిస్తారంటూ? వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఏ టిక్కెట్ ఇవ్వకపోయినా ధర్మవరం నియోజకవర్గంలో కూటమి పార్టీ గెలుపు కోసం పనిచేసినందుకు షోకాజ్ నోటీసు ఇస్తారా? అని నిలదీస్తున్నారు. పరిటాల కుటుంబం తొలి నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ ఇలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం పరిటాల కుటుంబాన్ని అవమానించడమేనని అంటున్నారు. అసలు ధర్మవరం లో గ్రీవెన్స్ డే ఎందుకు నిర్వహించాలని వారు ప్రశ్నిస్తున్నారు.
ఎందుకు నిర్వహించాలి?
ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. ఆయన బీజేపీకి చెందిన వారు. అక్కడ గ్రీవెన్స్ డే నిర్వహిస్తే స్థానిక ఎమ్మెల్యేపైనే ఫిర్యాదులు వస్తాయి. వాటిని తీసుకుని ఏం చేయాలని పరిటాల అనుచరులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంతో పాటు బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో టీడీపీ దాదాపుగా నిర్వీర్యమవుతుందని, అయినా పై నుంచి ఆదేశాలు మాత్రం వారికే మద్దతుగా నిలుస్తున్నారని, టీడీపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. మొత్తం మీద నారా లోకేశ్ పరిటాల శ్రీరామ్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వమని ఆదేశాలు జారీ చేయడం మాత్రం పరిటాల వర్గీయులకు కాక రేపింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తి పోస్తున్నారు.
Next Story

