Fri Dec 05 2025 08:20:36 GMT+0000 (Coordinated Universal Time)
Parakala Prabhakar : చంద్రబాబుకు పరకాల ఇలా స్ట్రోక్ ఇచ్చారేమిటో?
ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన మిత్రుడిగా ఉన్న పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగిస్తున్నాయి

ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన మిత్రుడిగా ఉన్న పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగిస్తున్నాయి. 2014 లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పరకాల ప్రభాకర్ చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగానే ఉన్నారు. సలహాదారుగా పనిచేశారు. తర్వాత ఆయన ఇక రాజకీయాలకు దూరమయ్యారు. కేవలం అప్పడప్పుడు విశ్లేషణలు మాత్రమే చేస్తున్నారు. పరకాల ప్రభాకర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త. హైదరాబాద్ లో ఉన్న పరకాల ప్రభాకర్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అదీ గత ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను ఆయన ఎత్తి చూపారు.
49 లక్షల ఓట్లు అదనంగా...
2024 లో జరిగిన ఎన్నికల్లో దేశంలో ఐదు కోట్ల ఓట్లు అదనంగా లెక్కింపులో రావడం జరిగిందన్నారు. దేశ వ్యాప్తంగా 174 నియోజకవర్గాల్లో ఓట్ల శాతం పోల్ అయిన దానికంటే పెరిగితే మిగిలిన చోట్ల ఓట్ల శాతం తగ్గిందంటూ పరకాల అన్నారు. గత ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పోలయిన ఓట్ల కటే ఐదు కోట్ల ఓట్లు లెక్కింపులో అదనంగా వచ్చాయని ఆయన చెప్పడం మాట అటుంచితే ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయాలను కూడా ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 49 లక్షల ఓట్లు అదనంగా కౌంటింగ్ లోకి రావడాన్ని పరకాల ప్రభాకర్ చెప్పడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అందుకే గెలిచే వాళ్లు ఓడిపోయారు.. ఓడిపోయే వాళ్లు గెలిచారంటూ కామెంట్స్ చేశారు.
వైసీపీ ఆరోపణలకు...
గత ఎన్నికల్లో వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. కూటమిలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేనలకు అధికారం దక్కింది. ఈవీఎంలో జరిగిన లోపాల వల్లనే తమకు అన్యాయం జరిగిందంటూ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ పదే పదే ఆరోపణలు చేస్తుంది. ఒంగోలులో పోటీ చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి సయితం న్యాయస్థానాన్ని ఆశ్రయించి తిరిగి లెక్కించాలని కోరారు. వైసీపీ నేతలకు కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో వారు విమర్శలకు దిగారు. ఇప్పుడు చంద్రబాబుకు ఒకనాడు సన్నిహితంగా ఉన్న పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఈ విషయం టాపిక్ గా మారింది. పరకాల ప్రభాకర్ వద్ద ఏ ఆధారాలున్నాయన్నది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పకపోవడం విశేషం. ఫలితాలు తారుమారు కావడానికి అధిక ఓట్లు పోలవ్వడమే కారణమని పరకాల వ్యాఖ్యలలో నిజమెంత అన్నది తేలాల్సి ఉంది.
Next Story

