Sun Dec 08 2024 05:46:40 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Praesh : ఏపీ రాజ్యసభ సభ్యులు ఆ ముగ్గురేనా? డిసైడ్ అయినట్లేనా?
ఆంధ్ర్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. మూడు రాజ్యసభ పదవులకు ఎన్నిక జరగనుంది.
ఆంధ్ర్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. మూడు రాజ్యసభ పదవులకు ఎన్నిక జరగనుంది. అయితే ఈ మూడు పోస్టులను కూటమి పార్టీలే కైవసం చేసుకోనున్నాయి. శాసననసభలో వైసీపీకి కేవలం పదకొండు మంది సభ్యులే బలం ఉండటంతో ఈ మూడు పోస్టులు కూటమి పార్టీలకే సొంతం కానున్నాయి. నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ పోస్టుల కోసం ఎవరి పేర్లు ఖరారు చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాజ్యసభ పోస్టులపై కసరత్తులు జరిపారు. రాజ్యసభలో తమకు ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఇందులో రెండు పోస్టులను టీడీపీ తీసుకునే అవకాశముంది. మరో పోస్టును జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయి.
టీడీపీ నుంచి...
వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ యాదవ్, ఆర్ కృష్ణయ్యల రాజీనామాతో ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందుకోసం అనేక మంది సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో టిక్కెట్ లభించని నేతలు ఇప్పుడు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా దేవినేని ఉమామహేశ్వరావు లాంటి నేతలు కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే రాజ్యసభ పదవి కోసం మూడు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా అశోక్ గజపతి రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. క్షత్రియులకు ప్రాధాన్యత కల్పించినట్లవుతుందన్న కారణంతో అశోక్ గజపతిరాజుకు రాజ్యసభ స్థానం దక్కే అవకాశాలున్నాయి.
జనసేన నుంచి...
అలాగే గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు కూడా వినిపిస్తుంది. అదే సమయంలో నెల్లూరు జిల్లాకు చెందని బీద మస్తాన్ యాదవ్ పేరును ఖరారు చేసే అవకాశాలున్నాయి. వైసీపీ సభ్యుడిగా రాజీనామా చేయడంతో ఆయనకు అవకాశాలివ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలియవచ్చింది. మూడు రాజ్యసభ పోస్టుల్లో నాలుగేళ్ల పదవీ కాలం ఉన్న పోస్టులు రెండున్నాయి. వీటికి ఎక్కువ పోటీ ఏర్పడుతుంది. మరో రాజ్యసభ స్థానాన్ని జనసేనకు కేటాయించనున్నారు. జనసేన నుంచి పవన కల్యాణ్ సోదరుడు నాగబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనకు పవన్ మాట ఇచ్చారన్న ప్రచారం జరుగుతుండటంతో నాగబాబు పేరు ఖాయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Next Story