Fri Dec 05 2025 07:14:11 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఈ ఎమ్మెల్సీకి మళ్లీ కష్టాలు మొదలయినట్లేగా?
ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ అనంతబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కలేదు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమండ్రి ఎస్సీ , ఎస్టీ కేసు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు స్టేకు నిరాకరించడంతో పునర్విచారణకు అడ్డంకులు తొలగిపోయినట్లేనని అంటున్నారు. అనంతబాబు ఈకేసులో ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు.. ఈ కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ, తదుపరి విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. దీంతో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ఇక వేగంగా అడుగులు వేస్తుంది.
పునర్విచారణ చేయడానికి...
కేసు పూర్వాపరాలు తేల్చి, బాధితులకు న్యాయం చేసే విషయంలో వేగంగా అడుగులు వేయడానికి సిట్ అధికారులు సిద్ధమయ్యారు. 2022 మేలో డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసినట్లు ఎమ్మెల్సీ అనంతబాబుపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో అనంతబాబు జైలుకు కూడా వెళ్లి వచ్చారు.మృతుడి తల్లి ఫిర్యాదుపై ప్రభుత్వం తదుపరి చర్యలకు సిద్ధమయింది. కేసుపై లోతైన విచారణ చేయడంతోపాటు 90 రోజుల్లో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేయాలని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పునర్ విచారణలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ కేసులో న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును న్యాయ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది.
మూడు నెలల్లో...
గతంలో విచారణలో లోపాలను గుర్తించడమే కాకుండా తొంభయి రోజుల్లో పూర్తి విచారణ పూర్తి చేసే దిశగా సిట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అనంతబాబుకు నాడు గన్ మెన్లుగా ఉన్న వారిని సిట్ అధికారులు ఇప్పటికే విచారించారు. ఆరోజు ఏం జరిగింది? ఘటనలో ఎవరెవరు ఉన్నారు? అనే విషయాలపై అన్ని కోణాల్లో విచారణ జరిపింది. ఒక్కడే హత్య చేసి, డెడ్ బాడీని తరలించే అవకాశం లేదని భావించి సహకరించిన వారు ఎవరనేది సిట్ అధికారులు తేల్చనున్నారు. ఇప్పుడు తాజాగా హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సిట్ అధికారులు త్వరగానే ఈ కేసును పునర్వించారించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు రెడీ అయిపోయారు. మరి అనంతబాబు అరెస్ట్ ఎంతో దూరం లేదన్నది సిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
Next Story

