Wed Dec 24 2025 10:43:04 GMT+0000 (Coordinated Universal Time)
TDP : ఇది విన్నారా.. అక్కడ ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలే.. కానీ వైసీపీ వాసనలే
నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు ఎక్కువ మంది వైసీపీ నుంచి వచ్చిన వారే.

నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు ఎక్కువ మంది వైసీపీ నుంచి వచ్చిన వారే. నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలుంటే అందులో మంత్రి నారాయణ తప్పించి అందరూ వైసీపీ నుంచి వచ్చిన వారే. చివరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ నుంచి వచ్చిన వారే. అందుకే నెల్లూరు జిల్లాలో వైసీపీ క్యాడర్ కు టీడీపీకి దీర్ఘకాలంగా పనిచేసిన వారికంటే పనులు ఎక్కువవుతున్నాయన్న ఆందోళన టీడీపీ కార్యకర్తల్లో బలంగా వినిపిస్తుంది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా ఈ ఆరు నియోజకవర్గాల నుంచి పెద్దయెత్తున ఫిర్యాదులు వస్తుండటం చంద్రబాబు, లోకేశ్ లకు తలనొప్పిగా మారింది. వైసీపీ నుంచి వచ్చిన వారితో తాము ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.
కార్యకర్తల ఫిర్యాదులతో...
ఇటీవల చంద్రబాబు నాయుడు, లోకేశ్ లు మంగళగిరిపార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు. వారిలో ఎక్కువ మంది నెల్లూరు జిల్లా నుంచి వస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. తమకు అనుకూలురైన, తమతో సుదీర్ఘకాలం వెన్నంటి నడిచిన వారికే ప్రాధాన్యత దక్కుతుందని ముఖ్య కార్యకర్తలు చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతున్నారు. నెల్లూరు లోక్‌సభ పరిధిలో ఏడుగురు మంది ఎమ్మెల్యేలుంటే, ఒక్క పొంగూరు నారాయణ తప్ప మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా వైసీపీ నుంచి వచ్చిన వారే కావడంతో తమకు పనులు జరగడం లేదని, అసలు తమను వారు కార్యకర్తలుగా కూడా చూడటం లేదని వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.
త్వరలో ఎమ్మెల్యేలతో సమావేశం...
వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎన్నికలకు ఏడాదిన్నర ముందే వచ్చారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కావ్య కృష్ణారెడ్డి చివరి నిముషంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. కందుకూరి శాసనసభ్యుడు ఇంటూరి నాగేశ్వరరావు, ఉదయగిరి శాసనభ్యుడు కాకర్ల సురేష్ రాజకీయానికి పూర్తిగా కొత్త. కందుకూరులో ఇటీవల జరిగిన సంఘటన ఎమ్మెల్యే చేతకాని తనంతోనే పార్టీ ఇబ్బంది పడిందని అధినాయకత్వం భావిస్తుంది. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో పేరుకు టీడీపీ ఎమ్మెల్యేలున్నప్పటికీ వైసీపీ క్యాడర్ కే పనులు ఎక్కువవుతుండటం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. దీనిపై దృష్టి పెట్టిన నాయకత్వం త్వరలోనే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిసింది.
Next Story

