Thu Dec 05 2024 16:20:15 GMT+0000 (Coordinated Universal Time)
ఉదయగిరి టీడీపీ టికెట్ ఎవరికో..?
ఉదయగిరి టికెట్టు విషయమై వైసీపీలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతం నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు మెట్టుకూరు ధనుంజయరెడ్డి, పోలీస్ హౌసింగ్
నెల్లూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పోటీ ఉండగా.. ఉదయగిరిలో మాత్రం ఊహించని రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయగిరిలో వైసీపీలో ఇప్పటికే విభేదాలు తారా స్థాయికి చేరుకోగా.. అది టీడీపీకి ఓ రకంగా ప్లస్ గా మారినా.. ఊహించని తలనొప్పికి కారణమైంది. వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చిన నాయకులకు ఉదయగిరిలో టీడీపీ టికెట్ ఇస్తుందా అనేది పెద్ద ప్రశ్న. అలా కానీ జరిగితే ఎన్నో ఏళ్లుగా టికెట్ ఆశిస్తున్న సొంత పార్టీ నాయకుల నుండే తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ టికెట్ ఎవరికో కాలమే సమాధానం చెబుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆయన టీడీపీ వైపు వెళ్లే అవకాశమే ఎక్కువగా ఉంది. ఎన్నికల కోసం ఇప్పటికే ఆశావహులంతా టీడీపీ టికెట్టు కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మేకపాటిని వైసీపీ వద్దనుకోవడం టీడీపీ యూనిట్ కు కూడా అక్కడ కాస్త షాకింగ్ గానే అనిపిస్తోంది. మేకపాటి తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా ప్రజలకు పరిచయం చేసుకొంటూ ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ తరపున పోటీ చేయడం ఖాయం అని అంటూ ఉన్నారు కూడా. దాదాపు రెండు దశాబ్దాలకుపైగా ఉదయగిరి రాజకీయాలను శాసించిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి పార్టీలతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఉదయగిరి టీడీపీ అభ్యర్థి ఈయనే అని కూడా ప్రచారం సాగుతూ ఉంది.
ఉదయగిరి టికెట్టు విషయమై వైసీపీలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతం నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు మెట్టుకూరు ధనుంజయరెడ్డి, పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డిల మధ్య పోటీ ఉంది. ఈ మధ్య పోటాపోటీగా జరిగిన బైక్ ర్యాలీలను వీరు నిర్వహించారు. వైసీపీ తరపున ఈ ఇద్దరు నాయకులు టికెట్ల రేసులో ఉన్న కారణంగా బైక్ ర్యాలీలను ఒక బలప్రదర్శనగా మార్చుకున్నారు. ఉదయగిరి టికెట్టు రేస్‌లో వంటేరు వేణుగోపాల్‌రెడ్డి కూడా ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గాన్ని వదులుకోవడం ఇష్టంలేని మేకపాటి కుటుంబపెద్ద రాజమోహన్‌రెడ్డి.. చంద్రశేఖర్‌రెడ్డి కుమార్తె రచనా రెడ్డి లేదా తన చిన్న తమ్ముడు రాజారెడ్డిలలో ఎవరో ఒకరికి టిక్కెట్టు తెచ్చుకోవాలని చూస్తున్నారు. అలా ఉదయగిరిలో అటు టీడీపీలోనూ.. ఇటు వైసీపీ లోనూ టికెట్లకు సంబంధించిన రచ్చ కొనసాగుతూనే ఉంది.
Next Story