Mon Mar 02 2026 14:36:07 GMT+0530 (India Standard Time)
TDP : లోకేశ్ సీఎం కావడం సులువే..కానీ వాట్ నెక్ట్స్?
మంత్రి నారా లో్కేశ్ కు పదోన్నతి పై పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది

మంత్రి నారా లో్కేశ్ కు పదోన్నతి పై పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. ఆయనను త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రిగా చేస్తారన్న ఊహాగానాలు పెద్దయెత్తున వినిపిస్తున్నాయి. అయితే అది అంత సులువు కాదనే వారు కూడా అధికంగానే పార్టీలో కనిపిస్తున్నారు. టీడీపీకి భావినేతగా లోకేశ్ అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇది సరైన సమయం కాదన్నది సీనియర్ నేతల వాదనగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆర్థికంగా సంక్షోభంలో ఉంది. కూటమిగా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుంది. ఏ మాత్రం కూటమిలో బీటలు వారినా అది అసలుకే ఎసరు వస్తుంది. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే ఇది సరైన సమయం కాదని ఆయన కూడా అభిప్రాయపడుతున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
పదవి సులువే..
లోకేశ్ ముఖ్యమంత్రి కావాలంటే సులువే. ఎందుకంటే కూటమిలోని ఏ పార్టీలతో సంబంధం లేకుండా దాదాపు 135 మంది శాసనసభ్యులున్నారు. ఒక్క టీడీపీఎమ్మెల్యేలతోనే లోకేశ్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించవచ్చు. ఎటువంటి అడ్డంకులు ఉండవు. కానీ తర్వాత జరిగే రాజకీయ పరిణామాలు టీడీపీకి ఇబ్బంది కలిగించవచ్చు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు కావస్తుంది. మరో మూడేళ్లు మాత్రమే గడువు ఉంది.మూడేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని లోకేశ్ కు బలవంతంగా అప్పగిస్తే అందుకు పార్టీ కూడా భారీ మూల్యం చెల్లించక తప్పదంటున్నారు. చంద్రబాబు చాలా సీనియర్ రాజకీయ నేత. ఆయనపై ఇప్పటికీ జనంలోనూ, క్యాడర్ లోనూ, నేతల్లోనూ అపారమైన విశ్వాసం ఉంది.
రాజకీయంగా చూస్తే...
లోకేశ్ కు ఇంకా రాజకీయ అనుభవం కావాలంటున్నారు. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. అందులోనూ లోకేశ్ దూకుడు రాజకీయాలు జగన్ పాలిటిక్స్ ఒకేలా ఉంటాయంటున్నారు. అందువల్ల మూడేళ్లకే మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందన్నభయం కూడా టీడీపీ నేతల్లో ఉంది. లోకేశ్ కూడా ఇప్పుడు తొందరపడరనే అంటున్నారు. లోకేశ్ వయసు రాజకీయంగా చూస్తే చాలా చిన్నది. ఆయనకు ఎంతో భవిష్యత్ ఉంది. అలాంటి లోకేశ్ తొందరపడి సీఎం సీటు కోరుకుంటే మరో అఖిలేష్ యాదవ్ కాక తప్పదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల్లో తండ్రుల నుంచి తనయుల చేతికి పార్టీ మారిన తర్వాత కష్టాలు మొదలయ్యాయి. అన్నీదృష్టిలో ఉంచుకుని లోకేశ్ అడుగులు వేస్తారని, ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ లోకేశ్ దే పెత్తనం సాగుతున్నందున ప్రత్యేకంగా ముఖ్య పదవి అనవసరమన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
Next Story

