Mon Mar 23 2026 14:54:00 GMT+0530 (India Standard Time)
Janasena : నాగబాబుకు మంత్రి పదవి దక్కనిది అందుకేనా? అందుకే ఆపారా?
జనసేనలో తాజాగా ఒక టాక్ వినిపిస్తుంది

జనసేనలో తాజాగా ఒక టాక్ వినిపిస్తుంది. మంత్రివర్గంలో అన్ని ప్రాంతాలకు అవకాశం కల్పించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో పవన్ కల్యాణ్ ఆంద్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఈసారి ఉత్తరాంధ్రకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు టాక్ నడుస్తుంది. జనసేనకు ఉన్న మూడు మంత్రి వర్గ స్థానాల్లో మార్పులపై కూడా చర్చ సాగుతోంది. కానీ పార్టీపరంగా అలాంటి దేమీ ఉండబోదని అంటున్నారు. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లు ముగ్గురు జనసేన పార్టీ బలోపేతానికి తొలినుంచి కృషి చేసిన వారే.
మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో...
అయితే ఇందులో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కందుల దుర్గేష్, పవన్ కల్యాణ్ లు ఇద్దరూ తూర్పు గోదావరి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరాంద్ర జిల్లాలకు, రాయలసీమకు జనసేన నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. మరో మంత్రి పదవి తీసుకోవాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు తెలిసింది. ముందుగా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావించినా ఆ ఆలోచన విరమించుకోవడానికి ప్రధాన కారణం ఉత్తరాంధ్రకు ఒక మంత్రి పదవి ఇవ్వాలన్నదేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాంధ్రలో పార్టీపరంగా పుంజుకునేందుకు వ్యూహాలు రచిస్తున్న పార్టీకి ఇక్కడ మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా కొణతాల రామకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకుంటే బాగుంటుందన్న చర్చ సాగుతోంది.
ఉత్తరాంధ్రకు కేటాయిస్తే...
గత ఎన్నికల్లో జనసేన పాలకొండ, నెల్లిమర్ల, యలమంచిలి, పెందుర్తి, విశాఖ దక్షిణం, అనకాపల్లిలో విజయం సాధించింది. అందులోనూకొణతాల రామకృష్ణ సీనియర్ నేత. కాంగ్రెస్ హయాంలోనే కొణతాల రామకృష్ణ మంత్రిగా పనిచేశారు. నిజాయితీ పరుడిగా పేరుంది. అలాగే జనంలోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న నేతగా కొణతాల రామకృష్ణ గుర్తింపు పొందారు. దీంతో పాటు కొణతాలది గవర సామాజికవర్గం కూడా కావడంతో ఆయనకు కలసి వచ్చే అంశంగా చెబెతున్నారు. ఆయనకు ఉత్తరాంధ్రలో ఉన్న పట్టు, పేరును దృష్టిలో పెట్టుకుంటే.. వచ్చే ఎన్నికల నాటికి సామాజిక వర్గం పరంగా కూడా కొణతాలకు.. మంత్రి పదవి ఇస్తే.. మేలు జరుగుతుందన్న చర్చ ఉంది. అందుకే మంత్రివర్గ విస్తరణలో నాగబాబుకు కాకుండా కొణతాలకు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయన్న టాక్ వినపడుతుంది. మరి పవన్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది చూడాలి.
Next Story

