Sat Dec 13 2025 22:31:44 GMT+0000 (Coordinated Universal Time)
Nadendla Manohar : నాదెండ్లకు శత్రువులు ఎక్కువయినట్లుందిగా?
నాదెండ్ల మనోహర్ జనసేనలో నెంబర్ టూ లీడర్.

నాదెండ్ల మనోహర్ జనసేనలో నెంబర్ టూ లీడర్. అయితే ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా మిత్ర పక్షాలకు చెందిన ఎమ్మెల్యేల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వంలో నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ బాధ్యతలను చేపట్టిన వెంటనే తన శాఖలో సంస్కరణలను తీసుకు వచ్చారు. స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టారు. అలాగే కొన్ని కఠిన నిర్ణయాలను కూడా తీసుకున్నారు. రేషన్ బియ్యం పక్కదారి పడుతుందని తొలినాళ్లలో నాదెండ్ల మనోహర్ హడావిడి చేశారు. అనేక పోర్టులను సందర్శించారు. షిప్ లలో తనిఖీలు నిర్వహించారు. ఇక రేషన్ దుకాణాలతో పాటు గోదాములను కూడా తనిఖీలు చేసి అధికారులను హడలెత్తించారు.
మిత్ర పక్షాలకు చెందిన నేతలే...
కానీ రాను రాను పౌర సరఫరాల శాఖపై కూటమిలోని మిత్ర పక్షాలకు చెందిన నేతలే విమర్శలు చేయడం ఆయనకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. ఒకరు కాకుంటే మరొకరు అన్నట్లు టీడీపీ ఎమ్మెల్యేలు పౌరసరఫరాల శాఖను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తుంది. తాజాగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా పౌరసరఫరాల శాఖను తప్పు పట్టేవిధంగా మాట్లాడారు. పదిహేను రోజులకు ఒకసారి కూడా రేషన్ అందడం లేదని ఆమె అన్నారు. వృద్ధులు ఇళ్లకు వెళ్లి రేషన్ సరుకులు సరఫరా చేయడం లేదని అన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పడుతుందని, దానిని అడ్డుకోవాలని నాదెండ్ల మనోహర్ కు అప్పీల్ చేశారు. ఆమె అప్పీల్ చేసినా రేషన్ సరఫరాలో ఇంకా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పకనే తెలుస్తుంది.
రేషన్ బియ్యం పక్కదారి పడుతుందని...
ఇక గతంలో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా అసెంబ్లీలోనే నాదెండ్ల మనోహర్ ను రేషన్ బియ్యం పక్కదారిపట్టడంపై నిలదీసినంత పని చేశారు. గత వైసీపీ ప్రభుత్వానికి, ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ లేదని పెదవి విరిచారు. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన నుడా ఛైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి అయితే రేషన్ బియ్యం చెన్నైకు అక్రమంగా తరలిపోతున్నాయని, టీడీపీ నేత ఒకరు రేషన్ మాఫియాగా మారారని సంచలన కామెంట్స్ చేశారు. ఇలా నాదెండ్ల మనోహర్ కు కూటమిలోని పార్టీ నేతలే శత్రువులుగా మారారు. ఆయన దీనిపై తరచూ టీడీపీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం నాదెండ్ల శాఖ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
Next Story

