Fri Dec 05 2025 08:02:58 GMT+0000 (Coordinated Universal Time)
Turakapalem Deaths Mystery : అంతుచిక్కని మరణాలకు కారణం అతడేనా?
గుంటూరు రూరల్ మండల పరిధిలోని తురకపాలెంలో మరణాలపై మిస్టరీ వీడుతుంది. అనేక కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తన్నారు

గుంటూరు రూరల్ మండల పరిధిలోని తురకపాలెంలో మరణాలపై మిస్టరీ వీడుతుంది. అనేక కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తన్నారు. తురకపాలెం మరణాల కేసులో కీలక మలుపు చోటు చేసుకుందని సమాచారం. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యంపైనే ప్రధానంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆర్ఎంపీ నిర్వహిస్తున్న క్లినిక్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేసి మరీ పరిశీలిస్తున్నారు. కలుషిత సెలైన్, శక్తిమంతమైన మందులే కారణమని భావిస్తున్న అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్ఎంపీ క్లినిక్‌ను సీజ్ చేసి, వైద్యుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కలుషిత నీరు, మద్యం తాగడం వల్లనే మరణించారని ఇప్పటి వరకూ అనుమానించిన అధికారులు ఇప్పుడు ఆర్ఎంపీ నిర్వహించిన వైద్యం కోణంలోనూ దర్యాప్తునకు శ్రీకారం చుట్టడంతో మిస్టరీ త్వరలోనే వీడే అవకాశముంది.
అన్ని రకాలుగా పరీక్షలు...
పరిస్థితిని సమీక్షించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ దర్యాప్తు బృందం నీటిని, మట్టిని, గాలి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపింది. గుంటూరు జిల్లా తురకపాలెంలో తీవ్ర కలకలం రేపడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమై ఆ గ్రామంలో ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించింది. కేవలం రెండు నెలల్లోనే ముప్ఫయి మంది మరణించడానికి గల కారణాలను అన్వేషించడానికి అవసరమైన అన్ని రకాల విచారణలను ప్రభుత్వం చేపట్టింది. మరొకవైపు ఎమ్మెల్యే కూడా పల్లె నిద్ర చేసి గ్రామస్థుల్లో ఉన్న మూఢనమ్మకాలను పారదోలేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో గత కొద్ది రోజులుగా ఆహారంతో పాటు మంచినీటిని కూడా ప్రభుత్వమే గ్రామస్థులకు సరఫరా చేస్తుంది.అంతుచిక్కని మరణాలకు అసలు కారణం ఏంటన్న దానిపై అధికారులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఆర్ఎంపీ వల్లనేనా?
అయితే ఈ వరస మరణాలకు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. కలుషితమైన సెలైన్ వాడకం వల్లే ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకంగా మారి ఉంటాయని ప్రాథమికంగా వైద్యులు అంచనా వేస్తున్నారు. గ్రామంలో జ్వరంతో బాధపడిన వారంతా మొదట ఈ ఆర్ఎంపీ వద్దకే వెళ్లినట్లు దర్యాప్తులో తేలడంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. వారికి కలుషితమైన సెలైన్లతో పాటు, మోతాదుకు మించి శక్తివంతమైన యాంటీబయాటిక్స్ వాడినట్లు అధికారులు గుర్తించారు. ఆర్ఎంపీ దగ్గర చికిత్స తీసుకున్న తర్వాతే బాధితుల ఆరోగ్యం మరింత విషమించిందని, ఆ తర్వాతే వారిని ఆస్పత్రులకు తరలించారని కుటుంబ సభ్యులు దర్యాప్తు బృందాలకు వివరించారు. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే విజయలక్ష్మి, బుధవారం ఆర్ఎంపీ క్లినిక్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి క్లినిక్ ను సీజ్ చేశారు. తనిఖీల్లో పలు శక్తివంతమైన యాంటీబయాటిక్ మందులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలిస్తున్నారు.
Next Story

