Wed Feb 25 2026 16:23:00 GMT+0530 (India Standard Time)
Mudragada : ముద్రగడ ఉన్న పేరును కూడా పోగొట్టుకుంటున్నారా?
కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభానికి పేరుండేది

కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభానికి పేరుండేది. అయితే అది ఒకప్పుడు. ఇప్పుడు పక్కా వైసీపీ నేత. అందుకే సొంత సామాజికవర్గమే ఆయనను పెద్దగా విశ్వసించడం లేదు. ముద్రగడ పద్మనాభం ఏం మాట్లాడినా సోషల్ మీడియా వేదికగా కాపు సామాజికవర్గం నుంచి పెద్దయెత్తున వ్యతిరేకంగా పోస్టింగ్ లు, కామెంట్స్ కనిపిస్తున్నాయి. గతంలో ముద్రగడపై ఎప్పుడూ ఇలా లేదు. కాపు సామాజిక వర్గానికి ఆయననే బ్రాండ్ అంబాసిడర్ గా భావించే వారు. అయన ఒక పిలుపు ఇస్తే చాలు.. వందలాది మంది కాపు యువత తరలి వచ్చేవారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన వంగవీటి రంగా తర్వాత అంతటి పేరు తెచ్చుకన్నారు ముద్రగడ. అయితే ఆయనకు ఇప్పుడు ఆ పేరు - ప్రతిష్ట సొంత సామాజికవర్గంలోనే లేదు.
పేరు మార్చుకోవడంతో...
ప్రధానంగా ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకోవడంతోనే ఒకింత ఇబ్బంది మొదలయింది. అప్పటి నుంచి ఆయన ఏం మాట్లాడినా కాపు సామాజికవర్గానికి నచ్చడం లేదు. మరొకవైపు ముద్రగడ పద్మనాభం నిజాయితీకి మారుపేరు అంటారు. అదే సమయంలో కొంత నిక్కచ్చిగా కూడా ఉంటారన్న పేరుంది. ఎన్టీఆర్ హయాం నుంచి ఆయనకు మంచి పేరుంది. తెలుగుదేశం పార్టీ నుంచి అనేక పార్టీలు మారారు. కాంగ్రెస్, బీజేపీ తాజాగా వైసీపీలో చేరారు. ఇన్ని పార్టీలు మారినా ఆయనకు దశాబ్దాలుగా రాజకీయాలు అచ్చిరావడం లేదు. పార్టీలు మారినా ఆయనకు అధికార పదవి లభించడం లేదు. ఆయన సన్నిహితుల్లో ఇదే రకమైన ఆవేదన తరచూ వినపడుతూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ముద్రగడ పద్మనాభం పై సానుభూతి పోవడంతో పాటు బాగా వ్యతిరేకత వచ్చినట్లే కనపడుతుంది. ఆయన వ్యవహార శైలి కూడా నచ్చడం లేదంటున్నారు.
వైసీపీ నీడన ఉండి...
ముద్రగడ పద్మనాభం గుంటూరు కు వచ్చి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అందులో తప్పులేదు. అయితే అదే సమయంలో టీడీపీపై ఆయన చేసిన విమర్శలు ఆయనకే ఇబ్బంది కరంగా మారాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా కాపులపై దాడులు జరుగుతున్నాయన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనకే ఎదురు తగిలేలా ఉన్నాయి. వైసీపీ నీడన ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే దానికి విలువ ఉండదన్న అభిప్రాయం కాపు సామాజికవర్గం నాయకుల్లోనూ ఉంది. ఆయన పెద్దాయన అని కొద్దో గొప్పో సానుభూతి ఉన్నప్పటికీ అది ఆయనకు తొలిసారి ఇంతటి వ్యతిరేకత రావడంతో ఆయన తన మార్గాన్ని, పంథాను పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పార్టీలో చేరి రాజకీయాలు మాట్లాడితే పార్టీ వ్యక్తిగానే చూస్తారని, వైసీపీ ఓటమి తర్వాత ముద్రగడ పద్మనాభం ఆ పార్టీలో కీలకంగా మారడంతో ఆయన మాటలకు, విమర్శలకు విలువలేకుండా పోయిందంటున్నారు.
Next Story

