Fri Dec 05 2025 14:56:44 GMT+0000 (Coordinated Universal Time)
Mopidevi : ఎన్నాళ్లు గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటావయ్యా సామీ
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజకీయంగా తన పతనాన్ని తానే కొనితెచ్చుకున్నట్లయింది

మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజకీయంగా తన పతనాన్ని తానే కొనితెచ్చుకున్నట్లయింది. గత కొన్ని నెలల నుంచి మోపిదేవి మాట కూడా వినిపించడం లేదు. రాజ్యసభ సభ్యుడిగా ఉండాల్సిన మోపిదేవి వెంకటరమణ రాజీనామా ఇప్పుడు ఖాళీగా గోళ్లు గిల్లుకుంటూనే ఉన్నారు. మహా అయితే.. రానున్న కాలంలో ఎమ్మెల్సీ పదవి దక్కుతుందేమో కానీ.. టీడీపీ ప్రభుత్వంలో మోపిదేవి వెంకటరమణకు మంత్రి పదవి దక్కడం మాత్రం జరిగే పని కాదు. అందులోనూ రేపల్లెలో తన చిరకాల ప్రత్యర్థి అనగాని సత్యప్రసాద్ ఉన్నప్పుడు మోపిదేవిని బొట్టు పెట్టి పిలిచి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. ఇంతోటి దానికి ఎందుకు రాజీనామా చేసి పార్టీ మారారంటూ అనుచరులే ప్రశ్నిస్తున్నారు.
రేపల్లె నియోజకవర్గంలోనూ...
ఇక రేపల్లె నియోజకవర్గంలోనూ వేలు పెట్టే అవకాశం కూడా మోపిదేవి వెంకటరమణకు గాని, ఆయన అనుచరులకు గాని లేదు. అది అనగాని అడ్డా కావడంతో మోపిదేవి నామమాత్రపు నేతగానే మిగిలిపోయారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభకు రాజీనామా చేసి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలని భావించారు. కొన్ని నెలల నుంచి మోపిదేవి వెంకటరమణ పదవి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకూ ఐదు ఎమ్మెల్సీ పోస్టులు భర్తీ అయినా అందులో మోపిదేవి పేరు కనిపించలేదు. మూడు టీడీపీ, జనసేన, బీజేపీ చెరొక స్థానం తీసుకున్నా మోపిదేవి వెంకటరమణకు మాత్రం ఛాన్స్ రాలేదు.
ఎమ్మెల్సీ ఇస్తారమో...
రానున్న ఖాళీల తర్వాత ఏదైనా మోపిదేవి వెంకటరమణకు ఛాన్స్ ఉంటే ఉండవచ్చు. కానీ ఎమ్మెల్సీకి మించి మోపిదేవి వెంకటరమణ ఎదగలేరన్నది వాస్తవం. ఎందుకంటే వైసీపీ నుంచి వచ్చిన నేత కావడంతో పాటు జగన్ కు జిగిరీ దోస్త్ కావడంతో చంద్రబాబు నాయుడు అంత తేలికగా మోపిదేవిని నమ్మే అవకాశం లేదు. రాజ్యసభ పదవి త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశముంది. అదీ ఒక్క ఛాన్స్ వరకూ మాత్రమే అన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. వైసీపీలో ఉన్న సమయంలో ఓడిపోయినా మంత్రిని చేసి, తర్వాత అనుకోని పరిస్థితుల్లో రాజ్యసభ పదవికి ఎంపిక చేసిన పార్టీని కాదని మోపిదేవి వెంకటరమణ సైకలెక్కి ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఏముంటుంది?
Next Story

