Sat Dec 07 2024 01:57:11 GMT+0000 (Coordinated Universal Time)
రుతుపవనాలు ఎప్పుడొస్తాయో చెప్పిన ఐఎండీ డైరెక్టర్
బిపోర్ జాయ్ తుపాను నేటి సాయంత్రం గుజరాత్ రాష్ట్రం వద్ద తీరం దాటనుందని అంచనా వేశారు. తీరం దాటాక మూడు..
మండుటెండలతో తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. విపరీతమైన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతకు తోడు అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఏ రోజుకారోజు సాయంత్రానికైనా వానచినుకు పడకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. నైరుతి రుతుపవనాలు జూన్ 8న కేరళను తాకాయి. ఆ తర్వాత మూడు రోజులకు రాయలసీమలోకి ఎంటరయ్యాయని వాతావరణశాఖ తెలిపింది. కానీ ఇప్పటి వరకూ ఎక్కడా పెద్దగా వర్షాలు పడింది లేదు. కేరళలో కొన్నిప్రాంతాల్లో వర్షాలుపడుతున్నా అది బిపోర్ జాయ్ తుపాను ప్రభావమని చెబుతున్నారు. తుపాను కారణంగా రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని ఇప్పటికే తెలిపారు. రుతుపవనాల విస్తరణలో కూడా పురోగతి కనిపించలేదు. జూన్ 11 నుంచి రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి.
తాజాగా రుతుపవనాల విస్తరణపై భారత వాతావరణ విభాగం ఒక ప్రకటన చేసింది. బిపోర్ జాయ్ తుపాను నేటి సాయంత్రం గుజరాత్ రాష్ట్రం వద్ద తీరం దాటనుందని అంచనా వేశారు. తీరం దాటాక మూడు రోజుల వరకూ తుపాను ప్రభావం ఉంటుంది. అంటే జూన్ 18 తర్వాత గానీ రుతుపవనాల్లో పురోగతి రాదు. ఈ విషయాన్నే ఐఎండీ వెల్లడించింది. ‘‘బిపర్ జాయ్ రుతు పవనాలకు మొదట్లో సాయపడింది. తుపాను ప్రభావంతో దక్షిణార్ధ గోళం నుంచి ఉత్తరార్ధ గోళానికి పవనాలు బలపడ్డాయి. తుపాను చాలా నిదానంగా కదలడంతో రుతుపవనాల విస్తరణకు సాయంగా నిలిచింది’’ అని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు.
‘‘ఇప్పుడు రుతుపవనాల విస్తరణపై తుపాను వ్యతిరేక ప్రభావం చూపుతోంది. జూన్ 18 వరకు తుపాను ప్రభావం రుతుపవనాలపై ప్రతికూలంగా ఉంటుంది. 18 తర్వాత రుతుపవనాల విస్తరణ బలపడుతుంది. దేశంలోని మరిన్ని ప్రాంతాలకు జూన్ 21 నాటికి రుతుపవనాలు చేరుకుంటాయి. జూన్ చివరి నాటికి రుతుపవనాలు పుంజుకుంటాయని ఆశిస్తున్నాం. అప్పటి వరకు మధ్య, ఉత్తర భారత్ లో తగినన్ని వర్షాలు ఉండకపోవచ్చు’’ అని ఎర్త్ సైన్స్ శాఖ మాజీ సెక్రటరీ ఎం రాజీవన్ పేర్కొన్నారు. మొత్తం మీద జూన్ నెలలో రుతుపవనాల రాకపై ఆశలు వదులుకోవచ్చని ప్రైవేటు వాతావరణ పరిశోధనా సంస్థ స్కైమెట్ వెదర్ అభిప్రాయపడింది. జూన్ చివరి వారంలోనైనా రుతుపవనాలు వేగం పుంజుకుని జులై లో వర్షాలు కురుస్తాయి.
Next Story