Sun Jun 22 2025 12:27:10 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : చంద్రబాబు అన్నదే జరుగుతుందా? మారరా? పనితీరును మెరుగుపర్చుకోరా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో చెబుతున్న మాటలను కూడా ఎమ్మెల్యేలు లెక్క పెట్టడం లేదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో చెబుతున్న మాటలను కూడా ఎమ్మెల్యేలు లెక్క పెట్టడం లేదు. ఎమ్మెల్యేలు పనితీరును మెరుగుపర్చుకోకపోతే వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారని ఆయన చేసిన హెచ్చరికలు మామూలుగా చేసినవి కావు. ఆయన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం నేర్పిన పాఠాలను అనుసరించి ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు. కానీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రం అస్సలు మాట వినడం లేదు. తామే అన్నింటికీ అతీతులమని వారు నమ్ముతున్నారు. ముఖ్యంగా మహిళ ఎమ్మెల్యేలు కూడా అత్యధిక మంది ఎక్కువగా తమ తమ నియోజకవర్గాల్లో ఇటువంటి విమర్శలను ఎదుర్కొంటున్నారు.
కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలే...
2024లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో దాదాపు ఎనభై ఎనిమిది మంది కొత్తవారు శాసనసభకు ఎన్నికయ్యారు. వీరిలో అత్యధిక మంది అతి చేస్తున్నారని చంద్రబాబుకు నివేదికలు అందుతున్నాయి. అందులోనూ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన వారు నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా తమకు తెలియాల్సిందేనని అంటున్నారు. తాము చెప్పిన వారికి, సూచించిన వారికి మాత్రమే పదవులు, కాంట్రాక్టులు ఇవ్వాలంటూ అధికారులపై చిర్రుబుర్రులాడుతున్నారు. అంతటితో ఆగకుండా తమకు అడ్డం వచ్చిన వారిని అవసరమైతే పార్టీ పదవుల నుంచి తప్పించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ప్రత్యర్థి పార్టీలు, తమకు గత ఎన్నికల్లో వ్యతిరేకంగా చేసిన వారిని కూడా మంచి చేసుకుని తర్వాత ఎన్నికలకు సిద్ధమవ్వాల్సిన వీరు సొంత పార్టీ నేతలను దూరం చేసుకుంటున్నారు. నా నియోజకవర్గం.. నా ఇష్టం అంటూ చెలరేగిపోతున్నారు.
కడపలో మాధవి రెడ్డి...
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై కూడా ఇలాంటి నివేదికలే అందాయి. క్యాడర్ ను పట్టించుకోకపోవడం, అంతా తాను చెప్పినట్లే నడుచుకోవాలని హుకుం జారీ చేయడం, పార్టీ నేతలను కూడా లెక్క చేయకపోవడం వంటివి కడప రెడ్డమ్మపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంగా ఉన్నారు. మరోసారి కడప టిక్కెట్ మాధవి రెడ్డికి ఇస్తే తాము పరోక్షంగా అయినా ఓడిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలే శపథాలు చేస్తున్నారంటే ఏ స్థాయిలో మాధవి రెడ్డి వ్యవహారశైలి ఉందో అర్థం చేసుకోవచ్చు. కడప నగర టీడీపీ అధ్యక్షుడు శివకొండారెడ్డిపై హత్యాయత్నం చేసిన వారిని ఆమె చేరదీయడం కూడా విమర్శలకు దారి తీసింది. మాధవి రెడ్డి మాటలు, తీరు సొంత పార్టీ నేతలనే ఇబ్బంది పెడుతున్నాయి. మహానాడు సక్సెస్ వెనక తామున్నామన్న ధీమాతో మాధవి రెడ్డి మరింతగా రెచ్చిపోతున్నారని టీడీపీ నేతలే చెబుతున్నారు. చంద్రబాబు దృష్టిలో మాధవి రెడ్డి పడ్డారని, ఏపీలో కేబినెట్ విస్తరణ జరిగితే మధవి రెడ్డికి బెర్త్ ఖాయమని ఆమె అనుచరులు ప్రచారం చేస్తున్నారు.
ఆళ్లగడ్డలో అఖిలప్రియ...
ఇక ఆళ్లగడ్డలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన భూమా అఖిలప్రియ కూడా నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2014లో ఏకగ్రీవంగా గెలిచిన అఖిల ప్రియ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2024లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాను చెప్పినట్లే నడుచుకోవాలని ఆమె ఆదేశాలు జారీ చేయడంతో పాటు తాను సూచించిన వారికే పదవులు ఇవ్వాలంటున్నారు. హైకమాండ్ వద్ద పైరవీలు చేసుకుని పదవులు తెచ్చుకున్న వారిని ఆళ్లగడ్డ లో కాలు మోపనివ్వబోనీయమని కూడా అఖిలప్రియ చేసిన హెచ్చరికలు పార్టీనే ఇబ్బందులు పెడుతున్నాయి. మరొక వైపు ఆళ్లగడ్డలో చికెన్ దుకాణాల నుంచి ఆమె అనుచరులు అక్రమంగా వసూళ్లకు దిగడం కూడా విమర్శలకు తావిస్తుంది. ఇక అఖిలప్రియకు సొంత బంధువులందరూ దూరం కావడంతో పాటు పార్టీ నేతలను కూడా డోన్ట్ కేర్ గా వ్యవహరిస్తుండటంతో ఇప్పుడు అఖిలప్రియకు క్యాడర్ నుంచి కూడా కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
Next Story