Fri Dec 05 2025 14:38:05 GMT+0000 (Coordinated Universal Time)
Koneti Adimulam : పార్టీ మారినా ప్రయోజనం ఏముంది... ఆదిమూలం ఆవేదన పట్టించుకునే దెవరు?
చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు

కొందరు రాజకీయ నేతలకు పాపం.. ఏ పార్టీలో ఉన్నా సుఖం ఉండదు. ఎమ్మెల్యేగా గెలిచారన్న మాటే కానీ వారు వార్డు సభ్యుడి కంటే హీనంగా చూస్తారు. అందులోనూ రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోవాల్సిందే. అది వైసీపీ అధికారంలో ఉంటే రెడ్డి సామాజికవర్గం నేతలు ఆధిపత్యం వహిస్తారు. టీడీపీ అధికారంలో ఉంటే కమ్మ సామాజికవర్గం నేతలు పెత్తనం చేస్తారు. ఫలితం మాత్రం సేమ్ టు సేమ్. అక్కడ ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కాదు. పార్టీని నడిపించే అధికార పార్టీ నేతల మాటకే విలువ ఉంటుంది. అధికారులు సయితం వారికే సెల్యూట్ కొడతారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా...
చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏ మాత్రం లేదు. సత్యవేడు నియోజకవర్గం నుంచి కోనేటి ఆదిమూలం 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. అయితే అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఆయన మాట చెల్లుబాటు కాలేదు. అంతా అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనమే నడిచింది. తన నియోజకవర్గం కాకపోయినా చిత్తూరు జిల్లా కావడంతో పెద్దిరెడ్డి చెప్పినట్లు అధికారులు నడుచుకునే వారు. ఆదిమూలం మాత్రం పేరుకు ఎమ్మెల్యేగా ఉన్నా ఏ ప్రయోజనమూ లేదు. పెద్దిరెడ్డితో కోనేటి ఆదిమూలం విభేదించడంతో ఆయనను తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఎంపీగా పోటీ చేయాలని అన్నారు. దీనికి ఇష్టపడని ఆదిమూలం టీడీపీలో చేరిపోయారు.
లైంగిక వేధింపుల కేసు...
టీడీపీ నుంచి 2024 ఎన్నికల్లో టిక్కెట్ తెచ్చుకున్న కోనేటి ఆదిమూలం రెండోసారి కూడా గెలిచారు. అయినా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పురాలేదు. ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. దీంతో తెలుగుదేశం పార్టీ ఆదిమూలం కోనేటిని సస్పెండ్ చేసింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదయింది. తనపై కుట్ర జరిగిందని ఆయన చెప్పినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత న్యాయస్థానంలో బాధితురాలు ఆ కేసును విత్ డ్రా చేసుకోవడంతో ఆదిమూలం కోనేటి పై కేసును కొట్టి వేశారు. కేసు ఏమీ లేదని తెలిసిన తర్వాత, బాధితురాలు స్వయంగా ప్రకటన చేసిన తర్వాత కూడా కోనేటి ఆదిమూలం పరిస్థితుల్లో మార్పు రాలేదు.
ఎవరెవరో వస్తూ...
దీంతో కోనేటి ఆదిమూలంకు కోపం నషాళానికి అంటింది. ఎంతమంది తనపై పెత్తనం చలాయిస్తారంటూ మండిపడ్డారు. కొద్ది రోజులుగా తనాు పార్టీకి దూరంగా ఉంటే నియోజకవర్గంలో ఎవరు పడితే వాళ్లు వస్తారా? అని ఆయన నిన్న ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యేకు కాకుండా పార్టీలో ఉన్న ఇతరులకు పోలీసులు ఎలా సెల్యూట్ కొడతారంటూ ఆదిమూలం కోనేటి మండిపడ్డారు. ప్రజల ఓట్లతో గెలిచిన తనను కాదని, ఒకరు కో- ఆర్డినేటర్ గా, మరకొరు పరిశీలకుడిగా చెప్పుకుంటూ నియోజకవర్గంలో పనులన్నీ చక్కబెట్టుకుంటున్నారని, తనపై తప్పుడు ప్రచారం చేసిన వారినే వీరు వెనకేసుకు వస్తున్నారని ఆదిమూలం కోనేటి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆదిమూలం ఆవేదన పట్టించుకునే వారెవరు?
Next Story

