Fri Mar 20 2026 11:56:44 GMT+0530 (India Standard Time)
Rain Alert : రెండు రాష్ట్రాల్లో నేడు కూడా వానలు.. చల్లటి వాతావరణం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్‌తో సహా తెలంగాణకు మరో మూడు రోజులు వర్షసూచన చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పంట ఉత్పత్తులు నష్టపోకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఏపీ లో రానున్న మూడు రోజుల పాటు...
ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయని చెప్పింది. కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, రేపు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అకాల వర్షాల నేపథ్యంలో మినుము, మిరప, పసుపు ఇతర పంటలను తడవకుండా భద్రపరుచుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండ కూడదని తెలిపింది.
తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్...
తెలంగాణలోనూ రానున్న రెండు రోజుల పాటు వానలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని చెప్పింది. తేలిక పాటి నుంచి మోస్తరు వానలు మాత్రమే పడతాయని పేర్కొంది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు ముప్ఫయినుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో వానలు పడతాయని, మరికొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశముందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కామారెడ్డి, సిద్ధిపేట, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో సాయంత్ర సమయాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Next Story

