Fri Dec 05 2025 19:08:43 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : ఈరోజు మరో అల్పపీడనం... ఇక మూడు రోజులు దబిడి దిబిడే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. ఈ ప్రభావంతో రేపు మధ్యాహ్నానికి దక్షిణఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని చెప్పింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదే సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని తెలిపింది.
మరో అల్పపీడనం...
ఈరోజు వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు కోస్తాంధ్రలో చెదురుమదురుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. భారీవర్షాల నేపధ్యంలో ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు,హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లోను పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.
ఈ జిల్లాలకు అలెర్ట్...
అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రానికి చెందిన అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖ, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. గుంటూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, మిగిలిన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, కడప జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
తెలంగాణలోనూ ఈ జిల్లాలకు...
తెలంగాణలోనూ అల్పపీడనం ప్రభావంతో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొరలుతున్నాయి. వచ్చే మూడు రోజులు అత్యంత కీలకమని, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. సూర్యాపేట్, సిద్ధిపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీచేసింది. యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, మెదక్, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. వరంగల్, సిద్ధిపేట్, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.
Next Story

