Sun Mar 15 2026 09:54:02 GMT+0530 (India Standard Time)
Rain Alert : మరో అల్పపీడనం .. మళ్లీ భారీ వర్షాలు తప్పవట
ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది

ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టంబరు 2వ తేదీ తర్వాత మరింత భారీ వర్షాలు పడతాయని, వరసగా రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాలకు మరో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కృష్ణా, గోదావరి నదులు కూడా ఉప్పొంగి పొరలే అవకాశముందని కూడా తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని చోట్ల పిడుగులు పడతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు చేపల వేటకు ఎవరూ వెళ్లవద్దని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో ఈరోజు...
తెలంగాణలో ఈరోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈరోజు వరంగల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, మెదక్, మంచిర్యాల, మహబూబాబాద్, ఆసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, హన్మకొండ, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వనపర్తి, వికారాబాద్, సిద్ధిపేట్, సంగారెడ్డి, రంగారెడ్డి, నారాయణపేట, నాగర్ కర్నూల్, మేడ్చల్ మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, జనగాం, హైదరాబాద్ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో నేడు...
ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. అయితే సెప్టంబరు రెండో తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. సెప్టంబరు 2 తర్వాత బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ చెప్పింది. మరొకవైపు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండిపోతున్నాయి. కృష్ణా, గోదావరి నదుల మీద ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలను జారీ చేసింది.
Next Story

