Fri Dec 05 2025 11:08:58 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : వాన వదలదట.. ముంపు ప్రాంతాలు ఇవేనట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గత కొద్ది రోజులుగా అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రెండు రోజులు గ్యాప్ ఇచ్చినా మళ్లీ మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే అనేక నదులు,వాగులు పొంగిపొరలుతున్నాయి. ప్రాజెక్టులు అన్నీ నిండిపోయాయి. ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి కొన్ని ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఏపీలో వారం రోజులు...
ఆంధ్రప్రదేశ్ లో మరో వారం రోజుల పాటు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవుకూడా ప్రకటించేంత రేంజ్ లో వర్షాలు పడ్డాయి. ఇక తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అనేక లంక గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. గోదావరి నదికి వరద ఉధృతి పెరగడంతో అనేక గ్రామాల ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. లంక గ్రామాల ప్రజల కోసం ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో తలదాచుకుంటున్నారు. గోదావరి శాంతించితే తప్ప తిరిగి వారి ఇళ్లకు చేరుకునే పరిస్థితి లేదు. మరొక వైపు కృష్ణానది కూడా పొంగి ప్రవహిస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ 69 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
తెలంగాణలో మూడు రోజులు...
తెలంగాణలోనూ మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని గ్రామాల్లోకి సంబంధాలు కట్ అయ్యాయి. వాగులు, వంతెనలు పొంగి పొరలు ప్రవహిస్తున్నాయి. మరొకవైపు కాళేశ్వరం, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండిపోయాయి. దాదాపు అన్ని ప్రాజెక్టులు నిండిపోయాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతుంది. మరికొద్ది రోజులు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో బలమైన ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెబుతుంది. కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Next Story

