Fri Dec 05 2025 20:26:16 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : వాతావరణ శాఖ చెప్పిన మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలంటే?
రానున్న మూడు రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది

భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. భారీవర్షాల నేపధ్యంలో ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరించింది.
వాగులు, కాల్వలు దాటొద్దు...
ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎట్టిపరిస్థితుల్లోను పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
తెలంగాణలో అప్రమత్తం...
రానున్న మూడు రోజులు పాటు తెలంగాణలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గత రెండు రోజులుగా వానలు ముఖం చాటేశాయి. అయితే మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముండటతో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది. ప్రాజెక్టులు పొంగి పొరలి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఎగువన భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాలక వరద నీరు చేరే అవకాశముందని తెలిపింది.
Next Story

