Fri Dec 05 2025 20:19:12 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : వర్షం.. వర్షం అంటున్నారే.. కానీ పడదేంటమ్మా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు తేలిక పాటి వర్షాలు మాత్రమే పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు తేలిక పాటి వర్షాలు మాత్రమే పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో పది రోజుల పాటు భారీ వర్షాల ఊసే ఉండకపోవచ్చని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే ప్రవేశించినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం మాత్రం ఎప్పటిలాగా నమోదు కాలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభయి ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ భారీ వర్షాలు కొద్దిరోజులు మాత్రమే పడటం, చిరుజల్లులు అలా కురిసి వెళ్లడం వల్ల ఉపయోగం లేదని అంటున్నారు అన్నదాతలు. అయితే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మాత్రం ప్రాజెక్టులు నిండిపోవడంతో కొంత వరకూ ఇబ్బంది లేదని అంటున్నారు.
ప్రాజెక్టులకు మాత్రం...
గోదావరికి వరద నీరు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కృష్ణానదికి మాత్రం వరద కొనసాగుతూనే ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్లను నీటిపారుదల శాఖ అధికారులు తెరిచారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా మూడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవడంతో సాగు నీటికి ఇబ్బంది లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆశించినంత మేరకు వానలు పడకపోవడంతో రైతుల కొంత ఇబ్బందులు పడుతున్నారు.
వచ్చే నెల రెండో వారం నుంచి...
వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఆగస్టు రెండో వారం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం ఆగస్టు రెండో వారంలో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. ఇప్పటికే తెలంగాణలో సాధారణం కంటే 3 శాతం వర్షపాతం తక్కువగా నమోదయిందని చెబుతుంది. ఆంధ్రప్రదేశ్ లోనూ సరైన వర్షాలు లేకపోవడంతో కరువు మండలాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడాలంటే మరో పది రోజుల పాటు ఆగాల్సిందేనంటుంది వాతావరణ శాఖ.
Next Story

