Fri Dec 05 2025 20:19:10 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : వాన.. వాన.. వల్లప్పా.. ఎప్పుడు కరుణిస్తావప్పా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలిక పాటి జల్లులు మాత్రమే పడతాయని చెప్పింది. వానలు పడకపోగా ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరుగుతాయని కూడా తెలిపింది. జులై నెలలో పడాల్సిన వర్షం కురియక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ లో సరైన వర్షాలు లేకపోవడంతో విత్తనాలు నాటిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సాగు నీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో రైతులు బిందెలతో నీటిని తెచ్చి పోసుకుంటున్న ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి.
ప్రాజెక్టులకు జలకళ...
అయితే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు మాత్రం నిండిపోతుండటం చాలా వరకూ ఊరట కలిగించే విషయమే. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టుల్లో గేట్లు అన్నీ ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. గోదావరి నదిలో వరద నీటి ప్రవాహం కొంత మేరకు తగ్గినప్పటికీ కృష్ణానదిలో మాత్రం వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తి వేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం దైవ దర్శనానికి వచ్చి భక్తులు ప్రాజెక్టును కూడా సందర్శిస్తుండటంతో అక్కడ రద్దీగా మారింది.
ప్రాజెక్టుల నుంచి దిగువకు...
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కుడి, ఎడమల జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కూడా దిగువకు 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు సాగు నీటికి, తాగునీటికి ఇబ్బంది లేదని చెబతుున్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా దాదాపు మూడు లక్షల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. జులై నెలలో ఆశించిన స్థాయిలో వానలు లేకపోవడంతో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. మరొక వైపు వాతావరణ శాఖ మాత్రం ఈ నెల రెండో వారం వరకూ భారీ వర్షాలు పడే అవకాశం లేదని చెప్పింది.
Next Story

