Fri Dec 05 2025 11:12:25 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : రానున్న నాలుగు రోజుల్లో వాన దంచికొడుతుందట.. బీ అలెర్ట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అనేక చోట్ల పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లేకపోతే ప్రాణాలు కోల్పోతారని హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు భారీ వర్షాలకు ఇబ్బందిపడే అవకాశమున్నందున అలెర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద, విద్యుత్తు స్థంభాలకు దూరంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లోనూ...
ఆంధ్రప్రదేశ్ లో రానున్న నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది.ఈరోజు అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశముందని, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, నంద్యాల,పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మాత్రం మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉరుములు, మెరుపులతో కూడిన...
తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు కూడా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. నాగర్ కర్నూల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. హైదరాబాద్ నగరంలో సాయంత్రానికి క్లౌడ్ బరస్ల్ అయ్యే ఛాన్స్ ను కొట్టిపారేయలేమని, ప్రజలు రేపు సాయంత్రం కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
Next Story

