Fri Dec 05 2025 13:36:23 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : విసుగెత్తిస్తున్న వానలు.. పండగ పూట ఇదేంది సామీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో అల్పపీడనం ఈ నెల 25వ తేదీన ఏర్పడనుందని దీని ప్రభావంతో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతుంది. అనేక చోట్ల కుండ పోత వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పండగ వేళ ఆంధ్రప్రదేశ్ లో నవరాత్రి ఉత్సవాలు, తెలంగాణలో బతుకమ్మ వేడుకలు జరుగుతున్న సమయంలో భారీ వర్షాలు భయాన్ని కలిగిస్తున్నాయి. పండగను వరుణుడు నిరాశలో ముంచేస్తున్నాడు. గత కొద్ది రోజుల నుంచి ఏపీ, తెలంగాణలలో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. అత్యధిక వర్షపాతం నమోదవుతుంది.
ఐదు రోజులు ఏపీలో...
ఆంధ్రప్రదేశ్ లోనూ మరో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపంది. తిరుపతి, చిత్తూరు, అనకాపల్లి, విశాఖ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అనకాపల్లి,కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. విశాఖ,ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 40నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు దగ్గర నిలబడవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
భారీ వర్షాలు ఇక్కడే
తెలంగాణలోనూ ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు నారాయణపేట, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్ వాసులు మాత్రం ఈరోజు కూడా అలెర్ట్ గా ఉండాల్సిందే. పగటి పూట ఎర్రటి ఎండ, సాయంత్రం వేళ కుండపోత వర్షంతో హైదరాబాద్ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆఫీసులకు వెళ్లి ఇంటికి చేరుకునే వారు. పండగ సమయంలో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కూడా హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసే అవకాశముంది కాబట్టి ప్రజలు గడప దాటి బయటకు రాకపోవడమే మంచిది.
Next Story

