Fri Dec 05 2025 14:09:57 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు...ప్రయాణాలు జాగ్రత్త
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరం దాటడంతో ఈ ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉంటుందని తెలిపింది. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలోని నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. నాగవళి, వంశధార నదులకు వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. గొట్టా బ్యారేజీకి కూడా అధికంగా వరద నీరు చేరింది. దీంతో ఇప్పటికే అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా బొప్పాయి వంటి పంటలు నష్టపోయారు. వీటితో పాటు పొలాల్లోకి వరద నీరు చేరడంతో భారీగా ఇసుక మేట వేసిందని అన్నదాతలు వాపోతున్నారు. ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో ఈ ప్రాంతంలో...
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ చెప్పింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. మత్స్యకారులు మరో మూడు రోజుల పాటు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని సూచించింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని చెప్పింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. దక్షిణకోస్తాంధ్రలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. రాయలసీమలోనూ ఈరోజు మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
సొంతూళ్లకు తిరగి వచ్చే సమయంలో...
తెలంగాణలోనూ మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది. వాయుగుండం తీరం దాటినప్పటికీ ఆ ప్రభావం తెలంగాణపై ఉంటుందని చెప్పింది. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా సొంత వాహనాలపై ప్రయాణించే వారు జాగ్రత్తలు పాటిస్తూ డ్రైవ్ చేయాలని, తొందరలో వచ్చేందుకు ప్రయత్నించవద్దని, రహదారులపై నీరు నిలిచిఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దసరా పండగకు వెళ్లిన వారు నేటి నుంచి తమ సొంతూళ్ల నుంచి తిరిగి హైదరాబాద్ కు చేరుకునే ప్రయత్నం చేస్తారు. వర్షాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశముందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
Next Story

