Fri Dec 05 2025 20:18:30 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఈ జిల్లాలకు.. అలెర్ట్ గా ఉండాల్సిందే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటి్కే ఈ విషయం భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ముఖ్యంగా ఫ్లాష్ ఫ్లడ్ ప్రాంతాలను గుర్తించి ఇళ్ల నుంచి ఎవరినీ బయటకు రాకుండా చూడాలని కూడా పేర్కొంది. దీని వల్ల కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయని, ఇందుకోసం పునరావాస కేంద్రాలను కూడా సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. రెవెన్యూ, విపత్తు నిర్వహణ సంస్థ, వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ప్రభుత్వ అధికారులకు సెలవులు ఇవ్వకుండా నిరంతరం డ్యూటీలో ఉండేలా చూడాలని పేర్కొంది.
పునరావాస కేంద్రాలను..
పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన పడవలతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా సిద్ధం చేసుకుని ఉండాలని, అవసరమైన ప్రాంతానికి తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటే మంచిదని వాతావరణ శాఖ సూచించింది. ఆంధ్రప్రదేశ్ లో ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే జిల్లాలను కూడా గుర్తించి ఆయా జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేయాలని ప్రభుత్వానికి విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రానున్న ఇరవై నాలుగు గంటలు బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని చెప్పింది. ఇక ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్గ్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
వాగులు, వంకలు దాటొద్దు...
తెలంగాణాలోనూ రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం మరింత బలపడే అవకాశమున్నందున రాగల రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్ష హెచ్చరికలను హైదరబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసింది. ఈరోజు హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని కూడా తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేయగా, పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగులకు సెలవులను రద్దు చేసింది. ప్రాజెక్టులు కూడా నిండుకుండలా మారడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. వాగులు, వంకలు పొంగిపొరలు తున్నాయి. ఎవరూ నదులు, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేసి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని కూడా హెచ్చరికలు జారీ చేసింది.
Next Story

