Thu Mar 26 2026 13:30:32 GMT+0530 (India Standard Time)
Bus Accident : మార్కాపురం బస్సు ప్రమాదానికి అదే కారణమా? బస్సు కండిషన్ సరిగా లేదట
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి బస్సు కండిషన్ కూడా ఒక కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి బస్సు కండిషన్ కూడా ఒక కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.దారి మధ్యలో ప్రమాదానికి గురైన బస్సు రిపేరుకు గురయిన విషయాన్నిబాధితులు చెబుతున్నారు. యర్రగొండపాలెం సమీపంలో బస్సు రిపేర్ కావడంతో దానిని అరగంట సేపు మరమ్మతులు చేసి తిరిగి బయలుదేరాశారని ప్రయాణికులు చెబుతున్నారు. ఈరోజు తెల్లవారు జామున 4.20 గంటలకు టోల్ గేట్ బస్సు దాటింది. టోల్ గేట్ దాటిన యాభై నిమిషాలకు ప్రమాదం జరిగిందని, 5.20 గంటలకు బస్సు ప్రమాదానికి గురయిందని బాధితులు తెలిపారు.
బస్సు కండిషన్ బాగా లేక..
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటి వరకు 13 మంది మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదం నేపథ్యంలో కీలక విషయం వెల్లడైంది. బస్సు కండీషన్‌పై అందులోని ప్రయాణికులు ముందుగానే ఆందోళన వ్యక్తం చేశారు. కండీషన్ సరిగా లేదని డ్రైవర్‌తో చెప్పారు. దీంతో బస్సు సిబ్బంది యర్రగొండపాలెం వద్ద గంటసేపు నిలిపి మరమ్మతులు చేశారు. అనంతరం బయల్దేరిన కొంత సమయం తర్వాత మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ఈ ఘోరం జరిగిపోయింది. బస్సు డ్రైవర్‌ను అధికారులు విచారిస్తే స్టీరింగ్ స్ట్రక్ అయిందని చెప్పినట్లు తెలిసింది.
క్షణాల్లో మంటలు వ్యాపించడంతో...
స్టీరింగ్ కూడా స్ట్రక్ అయిందని చెబుతున్నారు. అలాగే బస్సు కండిషన్ కూడా బాగా లేదని తాము గమనించినట్లు ప్రయాణికులు అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షణాల్లో మంటలు అంటుకోవడంతో ఎవరూ తప్పించుకోలేకపోయారని, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం నలభై ఒక్క మంది ప్రయాణికులున్నారని చెబుతున్నారు. అందులో పదమూడు మంది చనిపోగా, 26 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో నెల్లూరు నుంచి ఫోరెన్సిక్ నిపుణులను రప్పిస్తున్నారు. ఆరోగ్యం విషమంగా ఉన్న వారిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.
Next Story

