Fri Dec 05 2025 22:50:45 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మావోల దుశ్చర్య.. బస్సు దగ్ధం
సోమవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో కొత్తూరు వద్ద మావోయిస్టులు బస్సును అడ్డగించారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ..

చింతూరు : ఏపీలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అర్థరాత్రి సమయంలో ప్రైవేటు బస్సుకు నిప్పంటించి, బస్సును దగ్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతారామరాజు జిల్లాలోని చింతూరు ఏజెన్సీలో ఈ ఘటన జరిగింది. కొత్తూరు జాతీయ రహదారిపై అర్థరాత్రి సమయంలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ప్రైవేటు బస్సును మావోలు దగ్ధం చేశారు. దండకారణ్యం బంద్ పాటించాలని కోరుతూ.. ఈ ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.
సోమవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో కొత్తూరు వద్ద మావోయిస్టులు బస్సును అడ్డగించారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ కిందికి దించి బస్సుపై డీజిల్ పోసి తగలబెట్టారు. మావోల రాకతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు సమీపంలోని గ్రామంలో గ్రామస్తుల ఇళ్లలో తలదాచుకుని ఉదయానికి చింతూరు చేరుకున్నారు. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు గాయపడగా.. వారు చింతూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న చింతూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

