Fri Dec 05 2025 13:34:53 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : ఈయన వైసీపీలో ఉన్నారా? లేరా? ఇంత జరగుతున్నా?
కందుకూరు మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.

కందుకూరు మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆయన పార్టీలో ఉన్నారా? లేదా? అన్న అనుమానం వైసీపీ నేతల్లో కలుగుతుంది. వైసీపీలో మాత్రం యాక్టివ్ గా లేరని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఒక రకంగా చూస్తే మానుగుంట మహీధర్ రెడ్డి రాజకీయాల నుంచి వైదొలగారా? లేక ఇతర పార్టీల వైపు చూస్తున్నారా? అన్న అనుమానం ఆ పార్టీ నేతలకు కూడా కలుగుతుంది. మానుగుంట మహీధర్ రెడ్డి కుటుంబానికి మంచి పట్టున్న నియోజకవర్గంలో వైసీపీ కార్యక్రమాలు సక్రమంగా జరగకపోవడం పై కూడా పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు అందినట్లు చెబుతున్నారు. అదే సమయంలో గత ఎన్నికల్లో మానుగుంట మహీధర్ రెడ్డికి టిక్కెట్ కూడా దక్కలేదు.
పట్టున్న కుటుంబం కావడంతో...
ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్న నియోజకవర్గం కందుకూరు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి చూస్తే ఈ నియోకవర్గంలో టీడీపీ అంత సానుకూల పరిస్థితులు లేవు. 1983 నుంచి 2024 వరకు జరిగిన ఎనిమిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 1994, 1999, 2024 ఎన్నికల్లో మాత్రమే విజయం సాధించింది. కందుకూరు నియోజకవర్గం మానుగుంట ఫ్యామిలీకి కంచుకోటే అని చెప్పాలి. మానుగుంట ఫ్యామిలీకి చెందిన మానుగుంట మహీధర్ రెడ్డి, ఆయన తండ్రి ఆదినారాయణ రెడ్డి ఇక్కడ నుంచి చెరో మూడు సార్లు మొత్తంగా ఆరు సార్లు విజయం సాధించారు. మానుగుంట మహీధర్ రెడ్డి తండ్రి మానుగుంట ఆదినారాయణ రెడ్డి 1972లో ఇండీపెండెంట్గా విజయం సాధించారు. 1983, 1985లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభంజనం వీచినా కందుకూరులో మాత్రం ఆదినారాయణ రెడ్డి విజయం సాధించారు.
గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడంతో...
అయితే గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ కందుకూరు టిక్కెట్ ను మానుగుంట మహీధర్ రెడ్డికి కాదని బుర్రా మధుసూదన్ యాదవ్ కు ఇచ్చారు. ఆయనను కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా అక్కడి నుంచి మార్చి కందుకూరు టిక్కెట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి మానుగుంట మహీధర్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎక్కువగా ఆధ్మాత్మిక కార్యక్రమాలకు పరిమితమవుతున్నారు. ఇటీవల తిరిగి జగన్ మానుగుంట మహీధర్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నించినా సున్నితంగా తిరస్కరించారంటున్నారు. ఇటీవల జరిగిన కందుకూరు నియోజకవర్గంలో జరిగిన హత్య విషయంలోనూ మానుగుంట మహీధర్ రెడ్డి కనిపించకపోవడం కూడా ఈ ఊహాగానాలకు మరింత ప్రచారాన్ని పెంచింది. మొత్తం మీద ఒక కీలక నేత, పట్టున్న నేత మానుగుంట మహీధర్ రెడ్డి రాజకీయాల్లో ఉంటారా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదు.
Next Story

