Tue Jan 06 2026 19:59:41 GMT+0000 (Coordinated Universal Time)
TDP : మాచర్లలో టీడీపీ రెండుగా చీలనుందా?
మాచర్ల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటివ బ్రహ్మారెడ్డిపై టీడీపీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు

మాచర్ల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటివ బ్రహ్మారెడ్డిపై టీడీపీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తమను పట్టించుకోవాలంటూ మంత్రి నారా లోకేశ్ కు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. మాచర్ల నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రెండు గ్రూపులుగా విడిోయింది. కొన్ని దశాబ్దాల తర్వాత మాచర్లలో టీడీపీ జెండా ఎగిరందన్న ఆనందం ఇక్కడ నిలువ కుండా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వివిధ కేసుల్లో జైల్లో మగ్గుతుంటే మరొకవైపు ఆయనపై సానుభూతి పెరుగుతున్న సమయంలో మాచర్ల తెలుగు దేశం పార్టీ పరిస్థితి మరీ దిగజారి పోయే విధంగా తయారైందని సొంత పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు.
నూతన సంవత్సర వేడుకల నుంచి...
నూతన సంవత్సర వేడుకల నుంచి మాచర్లలోని రెండు వర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. టీడీపీ కార్యకర్తలపై జూలకంటి కన్నెర్ర చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద యెత్తున పోస్టులు కనిపిస్తున్నాయి. మాచర్ల లో టీడీపీ రెండుగా చీలబోతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బ్రహ్మారెడ్డి పై గుర్రుగా ఉన్న ఒక ప్రధాన సామాజికవర్గం నాయకులు, స్థానిక నెహ్రూనగర్ లోని వీవీఎన్ గార్డెన్స్ లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు డుమ్మా కొట్టారు. అంతే కాదు దానికి కూత వేటు దూరంలో అదే నెహ్రూనగర్ లో పల్నాడు అర్బన్ డెవలెప్ మెంట్ అథారిటీ చైర్మన్ , మాచర్ల తెలుగుదేశం సీనియర్ నాయకులు చిరుమామిళ్ల మధుబాబు నివాసం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో వారు పాల్గొనడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
టిక్కెట్ ఇవ్వవద్దంటూ...
వచ్చే ఎన్నికల్లో జూలకంటి బ్రహ్మారెడ్డి కి టిక్కెట్ ఇవ్వొద్దని, ఇస్తే ఓడిపోతామని, మధు బాబు కి తమ మద్దతు అని రెండు మండలాలకు చెందిన నాయకులు అధిష్టానానికి సంకేతాలు పంపారు. ఇప్పటికే పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ వద్దకు వెళ్లి మధుబాబు కి రెండు మండలాలు అప్పచెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేసిన ఆ నాయకులు ఇప్పుడు అసలు బ్రహ్మారెడ్డి వంక కూడా చూడట్లేదట. ఇదంతా ఇప్పుడే మొదలుపెట్టొదు, దానికి ఇంకా సమయం ఉంది అని వారితో వారించిన మధుబాబు, నామ మాత్రంగా నిన్న బ్రహ్మారెడ్డి ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారంటున్నారు. అయితే నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మధుబాబు నివాసానికి వెళ్లిన నాయకుల పేర్లు మొత్తం కనుక్కుని తనకి అందజేయాలని తన అత్యంత సన్నిహితుడైన రేషన్ వ్యాపారి కి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి చెప్పారని సమాచారం. దీంతో మాచర్లలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయిందంటున్నారు.
Next Story

