Fri Dec 05 2025 13:51:03 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జవాబు జగన్ చెప్పాల్సిందే.. ఇలా అయితే ఎవరుంటారు పార్టీలో?
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటలను చూస్తుంటే ఒక్కటి మాత్రం అర్థం అవుతుంది.

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటలను చూస్తుంటే ఒక్కటి మాత్రం అర్థం అవుతుంది. ఈ పరిస్థితిని జగన్ చేజేతులానే తెచ్చుకుంటున్నారు. నమ్మకమైన వారిని కూడా స్వయంగా జగన్ దూరం చేసుకుంటున్నారు. విజయసాయిరెడ్డి చెప్పే విషయాల్లో నిజాయితీ కనిపిస్తుంది. ఎందుకంటే సాయిరెడ్డి జగన్ పై ఎలాంటి దూషణలు చేయడం లేదు. అలాగే మద్యం కుంభకోణం విషయంలో డబ్బులు చేతులు మారాయన్న విషయం కూడా తనకు తెలియదనే సిట్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. అయితే రాజ్ కసిరెడ్డిపైనే ఆయన అక్కసు అంతా వెళ్లగక్కినా, జగన్ మాత్రమే కాదు ఆయన చుట్టూ ఉన్న కోటరీపైనే విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కావాలని తప్పుదోవ పట్టిస్తూ...
జగన్ ను కొందరు కావాలని తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల నుంచి తనను జగన్ దూరం పెడుతున్నారని ఆయన చెబుతున్న మాటల్లో వాస్తవముంది. ఎందుకంటే అప్పటి వరకూ ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్ గా ఉన్న విజయసాయిరెడ్డిని తప్పించి వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలను అప్పగించడంతోనే అందరికీ అర్థమయింది. దీంతో పాటు సాయిరెడ్డితో జగన్ అనుబంధాన్ని కట్ చేయడానికి అనేక మంది గత ఐదేళ్లలో కీలకంగా పనిచేశారన్నది కూడా వాస్తవమే. నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్ వరకూ విజయసాయిరెడ్డి కేవలం ఆడిటర్ గా మాత్రమే కాకుండా సొంత ఇంట్లో సభ్యుడిగా వ్యవహరించారు.
నమ్మకమైన వారికే...
జగన్ తో పాటు పదహారు నెలలు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. జగన్ అధికారంలో లేనప్పడు, ఉన్నప్పుడు సాయిరెడ్డి జగన్ మీద ఈగ వాలనిచ్చే వారు కాదు. అలాగే ప్రత్యర్థి పార్టీలపై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ధ్వజమెత్తేవారు. సాయిరెడ్డి జగన్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో కూడా ఎక్కువ సార్లు సీఎం క్యాంప్ కార్యాలయంలో కూడా కనిపించే వారు కాదు. జగన్ తనకు ఢిల్లీలో అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయడం వరకు మాత్రమే ఆయన పరిమితమయ్యారు. నాడు బీజేపీతో సంబంధాలు మంచిగా కొనసాగేలా సాయిరెడ్డి ఢిల్లీలో ఉండి పనులు చక్కబెట్టేవారు. ఒకరకంగా జగన్ ఐదేళ్ల పాటు ఢిల్లీ విషయాలను సాయిరెడ్డి మర్చిపోయేటట్లు చేశారు.
సాధారణ నేతల పరిస్థితి ఏంటి?
అలాంటి సాయిరెడ్డిని జగన్ దూరం చేసుకోవడం స్వయం కృతాపరాధం కాదా? జగన్ ఇక ఎవరిని నమ్ముతారు? తనంటే ఇష్టపడేవారిని, ప్రేమించే వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పుడు మాటలు విని దూరం చేసుకుంటే ఇక ఆయనకు ఎవరు మద్దతుగా నిలుస్తారు. కొన్నేళ్ల నుంచి నమ్మిన వ్యక్తినే జగన్ దూరం చేస్తే ఇక సాధారణ నేతల పరిస్థితి ఏంటని ఎవరికైనా ఆలోచన రాకమానదు. అందుకే జగన్ ఆలోచన కరెక్ట్ కాదు. ఇప్పుడు కోటరీ వాళ్లను కూడా దూరం చేయరని గ్యారంటీ ఏముంది? అందుకే జగన్ కు అందరూ దూరమవుతున్నారు. సొంత బంధువైన బాలినేని వంటి వారు మాత్రమే దూరమయితే ఇక మామూలు రాజకీయ నేతల మాటేమిటన్న సందేహం సహజంగా వైసీపీలో కొనసాగే నేతల్లో కలుగుతుంది. దీనికి జవాబు జగన్ చెప్పాల్సిందే.
Next Story

