Fri Dec 05 2025 12:41:54 GMT+0000 (Coordinated Universal Time)
BJP : మాధవా..? మారుస్తావా? ముందుకు తీసుకెళ్లగలవా?
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పీఎన్వీ మాధవ్ ను నాయకత్వం ఎంపిక చేసింది

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పీఎన్వీ మాధవ్ ను నాయకత్వం ఎంపిక చేసింది. అయితే ఎవరికి వారు మాధవ్ మావాడే అంటూ ఓన్ చేసుకనే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతి పరులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు మాధవ్ అని కథనాలు వండి వారుస్తుంటే, మరొకవైపు వైసీపీ కూడా చంద్రబాబు వ్యతిరేక వర్గంలో మాత్రమే కాకుండా, జగన్ కు అనుకూలంగా మాధవ్ ఉంటారని లెక్కలు వేస్తున్నారు. ఇంతకూ మాధవ్ ఎంపిక ఎలా జరిగిందన్న దానిపై అనేక మంది రాజకీయ ఔత్సాహికులు ఆరా తీస్తున్నారు. పార్టీ అధినాయకత్వం మాత్రం మాధవ్ అందరి వాడు అని చెప్పి అధ్యక్ష పదవికి ఎంపిక చేసినట్లు కనపడుతుంది.
రెండు వర్గాలుగా...
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రెండు వర్గాలు ఉన్న మాట ఎవరూ కాదనలేరు. ఒకటి చంద్రబాబు అనుకూల వర్గం కాగా, మరొకటి జగన్ కు పరోక్షంగా మద్దతిచ్చే వర్గం. ఈ రెండు వర్గాలను కలుపుకుని వెళ్లేలా మాధవ్ ను ఎంపిక చేశారంటారు. మాధవ్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నేత కావడంతో పాటు పార్టీకి లాయల్ గా ఉండటం కూడా అదనపు బలం అవుతుందని పార్టీ నమ్మింది. రెండు వర్గాలను సమంగా చేరదీసి పార్టీని ముందుకు నడిపే వ్యక్తి కోసం నాయకత్వం ఎంపిక చేసిందంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పగ్గాలు అప్పగిస్తే వారు ఒకవైపు మొగ్గు చూపే అవకాశముందని భావించిన పార్టీ నాయకత్వం తెలివిగా మాధవ్ ను ముందు పెట్టి కథను నడిపించాలని డిసైడ్ అయింది.
కుటుంబ నేపథ్యం చూసినా...
మాధవ్ ఎవరికి అనుకూలం కాదు. అలాగే ఎవరికీ వ్యతిరేకం కాదు. పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర నాయకత్వం ఆదేశాలను అమలు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తారంటున్నారు. తొలి నుంచి మాధవ్ ఫ్యామిలీ చరిత్ర పరిశీలించినా ఐదు దశాబ్దాల నుంచి ఆ కుటుంబం బీజేపీలోనే ఉంది. పార్టీ గట్టు దాటి బయటకు అడుగు మోపే వ్యక్తి కాదు. అలాగే యువకుడు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు అందరినీ మెప్పించి, ఒప్పించి రాజకీయంగా పార్టీలో సమస్యలు తలెత్తినా ఢిల్లీ వైపు చూడకుండా చేయడంలో దిట్ట అని పార్టీ కేంద్ర నాయకత్వం నమ్మింది. అందుకే మాధవ్ ఎంపిక జరిగిందన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలిసింది. మరి మాధవ్ నాయకత్వంలో బీజేపీ ఏ విధంగా ముందుకు వెళుతున్నది చూడాల్సి ఉంది.
Next Story

