Sat Sep 14 2024 11:05:48 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : రాజీనామాలు చేశారు సరే... చేరడానికి ఆటంకాలు ఎందుకు?
వైసీపీకి రాజీనామా చేసిన నేతలకు టీడీపీలో చేరేందుకు ఆటంకం ఏర్పడింది. పోతుల సునీత, మోపిదేవి వెంకటరమణ చేరికలకు బ్రేక్ పడింది
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో కొందరు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవితో పాటు వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే పార్టీలో ఇంత వరకూ చేరలేదు. వైసీపీ నుంచి పోతుల సునీతతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. రాజీనామా చేసి పది రోజులు దాటుతున్నా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకోలేదు. అందుకు అనేక కారణాలున్నాయని చెబుతున్నారు.
క్యాడర్ అభ్యంతరాలతో...
బీద మస్తాన్రావు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పోతుల సునీత విషయంలో మాత్రం స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోతుల సునీతను పార్టీలో చేర్చుకోవద్దంటూ క్యాడర్ పెద్దయెత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పోతుల సునీత టీడీపీలో ఉండేవారు. పోతుల సునీత భర్త పోతుల సురేష్ పరిటాల రవి అనుచరుడు. ఆమెకు తెలుగుదేశం పార్టీలో గతంలో మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చి ఆమెకు ప్రయారిటీ ఇచ్చారు. కానీ 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోతుల సునీత టీడీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
టీడీపీ నుంచి వచ్చి...
వైసీపీలో పోతుల సునీతకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. మహిళ అధ్యక్షురాలిగా నియిమించారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే తిరిగి టీడీపీ అధికారంలోకి రాగానే తనకున్న పరిచయాలతో ఆమె టీడీపీ అధినాయకత్వంలో కొందరికి దగ్గరయ్యారు. దీనికి తోడు టీడీపీకి కూడా శాసనమండలిలో ఎక్కువ మంది సభ్యుల మద్దతు, బలం అవసరం. అందువల్ల రాజీనామా చేసి రావాలని కోరారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పదవులకు రాజీనామా చేసి రావాలని, అయితే ట్రాక్ రికార్డు ను బట్టి పార్టీలో చేసుకుంటామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఆయన మనసులో మాట అర్థమయింది.
పార్టీలో చేర్చుకోవద్దంటూ...
పోతుల సునీతను పార్టీలో చేర్చుకోవద్దంటూ టీడీపీ సీనియర్ నేతలు కూడా చంద్రబాబుపై వత్తిడి తెస్తున్నారు. దీంతో ఆమె చేరిక విషయం పెండింగ్ లో పడినట్లయింది. అసలు పార్టీలో చేర్చుకుంటారా? చేర్చుకుని తిరిగి ఎమ్మెల్సీ పదవి ఇస్తారా? అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక రేపల్లెకు చెందిన మోపిదేవి వెంకటరమణ పరిస్థిితి కూడా అంతే. రేపల్లెలో మంత్రి అనగాని సత్య ప్రసాద్ వర్గం ఆయన చేరికను అడ్డుకుంటోందంటున్నారు. మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రచారం జరిగింది. అదే జరిగితే రేపల్లెల్లో నియోజకవర్గంలోని టీడీపీలో మళ్లీ గ్రూపులు మొదలవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మొత్తం మీద రాజీనామా చేసినా ఫలితం దక్కడం లేదని వైపీపీకి రాజీనామా చేసిన నేతలు ఆవేదన చెందుతున్నారు.
Next Story