Fri Dec 05 2025 11:30:25 GMT+0000 (Coordinated Universal Time)
Kurnool Bus Accident : మృతదేహాల కోసం బంధువుల ఎదురు చూపులు
కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది

కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. ఖచ్చితంగా మృతదేహాన్ని నిర్ధారించేందుకు డీఎన్ఏ టెస్ట్ లు అవసరం. అందుకే మృతుల బంధువులను ఇప్పటికే కర్నూలుకు రప్పించారు. నిన్న కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన వేమూరి కావేరి బస్సు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది మరణించిన సంగతి తెలిసిందే. బస్సులో నిద్రిస్తుండగా ఘటన జరగడం, బస్సు మొత్తం కాలి పోవడంతో ఎముకలు మాత్రమే మిగిలాయి. దీంతో వస్తువుల ఆధారంగా కొందరి మృతదేహాలను గుర్తుపట్టినా ఎక్కువ మంది ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోయాయి.
మరో రెండు రెండు రోజులు...
దీంతో డీఎన్ఏ టెస్ట్ లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి బస్సులో లభ్యమయిన ఆనవాళ్లన్నింటినీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడకు బంధువులు కూడా వచ్చారు. కుటుంబ సభ్యుల డీఎన్ఏ ఆధారంగానే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. డీఎన్ఏ రిపోర్టు వచ్చేందుకు రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. అప్పటి వరకూ వారి మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు వీలులేదు. డీఎన్ఏ బృందాలు సేకరించిన వారు కేవలం పన్నెండు మంది మాత్రమే ఉన్నారు. మరో ఏడుగురి నుంచి రక్తనమూనాలు తీయాల్సి ఉంది.
డీఎన్ఏ రిపోర్టు వచ్చిన తర్వాతనే...
డీఎన్ఏ రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రమే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. మరొకవైపు ప్రమాదంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రమాదం ఎందుకు జరిగింది? డ్రైవర్ నిర్లక్ష్యమా? లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. మరొకవైపు లగేజీ ఉంచే చోట పెద్దమొత్తంలో సెల్ ఫోన్లను ఉండటం కూడా గుర్తించిన పోలీసులు మంటల తీవ్రత పెరగడానికి అదే కారణమని భావిస్తున్నారు. అలాగే బైకర్ ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతున్నాడు. వర్షం కారణంగా స్కిడ్ అయి బైకర్ శివకుమార్ పడిపోవడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగిందని మరికొందరు అంటున్నారు. దీనిపై కూడా నేడు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశముంది.
Next Story

