Fri Dec 05 2025 20:27:57 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబును నేను కలవలేదు
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆడియోలు విడుదల చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు

తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆడియోలు బయటకు విడుదల చేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తన అరెస్ట్ కు రంగం సిద్ధమైందని సజ్జల లీకులు వదులుతున్నారని ఆయన ఆరోపించారు. సజ్జలకు అమెరికా అధ్యక్షుడికి సలహాదారుడిగా ఉండేటంత పరిజ్ఞానం ఉందని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు. థియేటర్ల యజమానుల నుంచి తాను నెలకు రెండు లక్షలు వసూలు చేస్తున్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
అరెస్ట్లకు భయపడను...
ఎలాంటి అరెస్ట్ లకు తాను భయపడే ప్రసక్తి లేదని చెప్పారు. తనపై విషప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. జీవితాంతం తనను జైలులో ఉంచినా తన గొంతును మాత్రం అణచలేరని పేర్కొన్నారు. చంద్రబాబును తాను కలిసినట్లు చెబుతున్న డిసెంబరు 25న తాను క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నానని చెప్పారు. తాను టీడీపీ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదన్నారు. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎన్నికల సమయంలో తేలుతుందన్నారు. కొత్తగా ఇన్ఛార్జిగా నియమితులైన ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Next Story

