Wed Jan 07 2026 17:29:03 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : కోనసీమ గుండెల మీద గ్యాస్ కుంపటి
కోనసీమ జిల్లాలో ఒ.ఎన్.జి.సీ గ్యాస్ లీకవుతుండటం సర్వసాధారణంగా మారింది

కోనసీమ జిల్లాలో ఒ.ఎన్.జి.సీ గ్యాస్ లీకవుతుండటం సర్వసాధారణంగా మారింది. కోనసీమ ప్రజలు బితుకు బితుకు మంటూ బతకాల్సి వవస్తుంది. ఒ.ఎన్.జి.సీ బావుల నుంచి గ్యాస్ లీకవుతున్నప్పుడే అధికారులు గుర్తించినప్పటికీ ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు నిత్యం నెలకొని ఉంటున్నాయన్నది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు, మలికిపురం, రాజోలు వంటి ప్రాంతాల ప్రజల గుండెల మీద నిత్యం మండే కుంపటి ఉన్నట్లే ఉంటుంది. తాజాగా మలికిపురం మండలంలోని ఇరుసుమండలోని గ్యాస్ పైపులైన్ లీకవ్వడాన్ని గమనించిన ప్రజలు ఆందోళనకు గురయ్యారు. భయాందోళనల మధ్య బతకాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
దావానంలా వ్యాపించడంతో...
ఉదయం 11.30 గంటల ప్రాంతంలో గ్యాస్ లీకేజీ ప్రారంభమై.. అది 12.30 గంటలకు మంటలు వ్యాపించి చుట్టు పక్కల ప్రాంతాన్ని దావానంలా వ్యాపిచింది. దాదాపు ముప్ఫయి మీటర్ల ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే ఒ.ఎన్.జి.సీ అధికారులు గ్యాస్ లీవ్వడం ముందుగానే గుర్గించి ఇరుసుమండలలోని గ్రామాన్ని మొత్తాన్ని ముందుగా ఖాళీ చేయించారు. మూడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అప్పటికే వారికి పరిస్థితి తీవ్రత అర్థమయింది. దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు మంటలను అదుపు చేయడం కష్టమేనని చెబుతున్నారు. అలాగే వేల సంఖ్యలో కొబ్బరి చెట్లు మాడిమసయిపోయాయి. కొన్ని ఇళ్లు మంటలకు ఆహుతయ్యాయి.
నష్టం అంచనా మాత్రం...?
దాదాపు గ్రామంలోని రెండు వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించి వారి ప్రాణాలను మాత్రం ఒ.ఎన్.జి.సీ అధికారులు రక్షించగలిగారు కానీ, ఆస్తి నష్టం కోట్లలోనే జరిగి ఉంటుంందని అంచనా వేస్తున్నారు. కేవలం కొబ్బరి తోటలు మాత్రమే కాకుండా ఒ.ఎన్.జి.సీ కి చెందిన రిగ్, భారీ వాహనాలు కూడా కాలి బూడిదయ్యాయి. ఇక ఆక్వా సాగులో కూడా తీవ్ర నష్టం వచ్చినట్లు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగినప్పటికీ మంటలను అదుపు చేయడం కష్టంగానే మారింది. నష్టం తెలియాలంటే మంటలు పూర్తిగా అదుపులోకి వస్తే తప్ప తెలియదని అధికారులు చెబుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
Next Story

