Mon Nov 17 2025 10:26:19 GMT+0000 (Coordinated Universal Time)
TDP : కొలికపూడిపై చర్యలు తప్పవా? నివేదికలో అదే ఉండనుందా?
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదానికి పార్టీ అధినాయకత్వం ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉంది

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదానికి పార్టీ అధినాయకత్వం ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉంది. కొలికపూడిపై చర్యలకు క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసే అవకాశముంది. కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య ఇటీవల జరిగిన వివాదం పార్టీని భారీగా డ్యామేజీ చేసింది. పార్టీ నేతల్లోనూ, క్యాడర్ లోనూ తప్పుడు సంకేతాలు వెళ్లాయి. అయితే కొలికపూడిపై చర్యలు తీసుకోవడంతో స్పష్టమైన సంకేతాలను ఇవ్వాలన్నది చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలియవచ్చింది. పేరుకు క్రమశిక్షణ కమిటీ అయినప్పటికీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే కమిటీ స్క్రిప్ట్ తయారు చేసే అవకాశాలను ఎవరూ కొట్టిపారేయలేరు.
రాజకీయంగా నష్టం కలిగించడంతో...
నిజానికి కొలికపూడి, కేశినేనిల మధ్య వివాదాన్ని తానే చూస్తానని చంద్రబాబు నాయుడు చెప్పినా లండన్ పర్యటన అకస్మాత్తుగా ఉండటంతో క్రమశిక్షణ కమిటీకి అప్పగించారు. ఇది తూతూ మంత్రమేనని అందరికీ తెలుసు. కానీ కొలికపూడి శ్రీనివాసరావుపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. ఆర్థిక పరమైన లావాదేవీలను బయటపెట్టడంతో పాటు వైసీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేశారని చెప్పడం కూడా ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. రాజకీయంగా నష్టం కలిగించింది. ఆయన కేశినేని చిన్నిపై వ్యాఖ్యలు చేసినప్పటికీ అది టీడీపీకి నష్టం జరిగింది. ఇంకా అనేక ఆరోపణలు చేశారు. అందుకే ముందుగా క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని కోరారు. ఇప్పటికే ఆయన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.
నేడు విచారణ జరిపి...
ఉదయం కొలికపూడి శ్రీనివాసరావును, సాయంత్రం కేశినేని చిన్నిలను క్రమశిక్షణ కమిటీ విచారించనుంది. కానీ కొలికపూడి శ్రీనివాసరావుపై ఏదో ఒక చర్యలు తీసుకోవాలన్నది మాత్రం పార్టీ అధినేత ఉన్నట్లు కనపడుతుంది. ఈ ప్రభావం రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాలపై పడకుండా ఉండాలంటే ఒకరిపై చర్యలు తీసుకుంటే కాని అన్నింటికీ ఫుల్ స్టాప్ పడదన్న భావన వ్యక్తమవుతుంది. అదే సమయంలో కేశినేని చిన్నికి కూడా వార్నింగ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోకి వెళ్లే ముందు స్థానిక ఎమ్మెల్యేకు తెలియపర్చకుండా వెళ్లడంపై ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉంది. కొలికపూడి శ్రీనివాసరావు గతంలో అనేక సార్లు పలు వివాదాల్లో క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయిన నేపథ్యంలో ఈ సారి మాత్రం చర్యలు తప్పవని అంటున్నారు. మరి చూడాలి.. చంద్రబాబు వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది.
Next Story

