Fri Dec 05 2025 23:15:08 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : కోలగట్ల కనిపించకపోవడానికి అదే కారణమటగా...?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కొందరు నేతలు కనిపించడం మానేశారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కొందరు నేతలు కనిపించడం మానేశారు. రాజకీయాల నుంచి తప్పుకున్నారా? లేక కావాలనే బయటకు రావడం లేదా? అన్నది అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ నేతలు యాక్టివ్ గా లేరు. గతంలో మంత్రులుగా పదవులు వెలగబెట్టిన వారు, కీలకమైన పదవులు దక్కించుకున్న వారు సయితం గత పదిహేడు నెలలుగా ముఖం చాటేస్తున్నారు. జగన్ ఎన్ని సార్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని చెబుతున్నప్పటికీ వారిలో మార్పు రావడం లేదు. వారిలో కోలగట్ల వీరభద్రస్వామి ఒకరు. విజయనగరం నియోజకర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేరు కూడా వినిపించడం లేదు. కనిపించడం లేదు.
మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నా...
2019 ఎన్నికల్లో కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాడు టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు కుమార్తె ఆదితి గజపతి రాజును ఓడించి శాసనసభలోకి అడుగుపెట్టారు. అయితే కోలగట్ల వీరభద్రస్వామి వైశ్య సామాజికవర్గం కావడంతో జగన్ మంత్రివర్గంలో తనకు స్థానం దక్కుతుందని భావించారు. కానీ నాడు మాత్రం కోలగట్ల వీరభద్రస్వామికి జగన్ కేబినెట్ లో చోటు దక్కలేదు. నాడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఆ సామాజికవర్గం కోటాలో మంత్రి పదవి లభించింది. దీంతో ఆయన కొంత అసంతృప్తికి లోనయ్యారు. అయితే తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవిని జగన్ కోలగట్ల వీరభద్రస్వామికి ఇచ్చి కొంత శాంతపర్చగలిగారు.
సత్తిబాబుపై ఆగ్రహమా?
2024 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసిన కోలగట్ల వీరభద్రస్వామి అదే ఆదితి గజపతి రాజుపై ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి దూరంగా ఉండటానికి జగన్ పై కోపం కన్నా అదే జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణపై కోపమేనని పార్టీ నేతలే అంటున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి తనకు నాడు మంత్రి పదవి దక్కకపోవడానికి బొత్స సత్తిబాబు కారణమని బలంగా నమ్మారు. ఇప్పుడు కూడా జిల్లాలో ఆయనను ఎమ్మెల్సీని చేసి, శాసనమండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా చేయడాన్ని జీర్ణించుకోలేని కోలగట్ల వీరభద్రస్వామి పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఆయన వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని, అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.
Next Story

