Fri Dec 05 2025 07:15:31 GMT+0000 (Coordinated Universal Time)
Kesineni Chinni : కేశినేని చిన్నిపై కొలికపూడికి అంత కోపం అందుకేనా?
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందరో విజయవాడ ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు. విజయవాడ పార్లమెంటకు పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరగగా ఎందరో ఎంపీలుగా ఎన్నికయ్యారు. అనేక పార్టీల నుంచి ఎన్నికైన వారు లోక్ సభలో తన గళం వినిపించారు. అయితే ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలను ఏ పార్లమెంటు సభ్యుడిపైనా రాలేదు. గతంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, పర్వతనేని ఉపేంద్ర, గద్దె రామ్మోహన్ రావు, లగడపాటి రాజగోపాల్, కేశినేని నాని వంటి వాళ్లు విజయవాడ ఎంపీలుగా విజయం సాధించారు. అయితే తమ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో వారంతా సఖ్యతగా ఉండేవారు.
కొలికపూడి ఆరోపణలివే...
అయితే తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రస్తుత ఎంపీ కేశినేని శివనాధ్ అలియాస్ చిన్నిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గతంలో ఏ ఎంపీపైనా ఇలాంటి ఆరోపణలు ఏ ఎమ్మెల్యే చేయలేదు. తన నియోజకవర్గంలో జూదాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఇసుక దందా నిర్వహిస్తున్నారని కొలికపూడి చేస్తున్న ఆరోపణలు ఎంపీపైన చేయడం సంచలనంగా మారింది. పార్లమెంటు సభ్యుడు చిన్ని కార్యాలయంలో ఉన్న సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారని కూడా కొలికపూడి శ్రీనివాస్ బహిరంగంగా ఆరోపణలు చేయడంతో ఇప్పుడు గతంలో పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన వారిని బెజవాడ వాసులు తలచుకుంటున్నారు. ఆ ఆరోపణల్లో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి ఆరోపణలు గతంలో ఎన్నడూ విజయవాడ ఎంపీపై రాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఘాటైన విమర్శలు...
తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు చిన్ని పై మామూలుగా లేవు. తన కన్సల్టెన్సీ ద్వారా విదేశాల్లో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన యువకులకు ఉద్యోగాలిప్పించి వారికి జీతాలు ఇవ్వకుండా 150 కోట్లు తీసుకున్నారని, వారి తల్లిదండ్రులు హైదరాబాద్ లో చిన్ని కార్యాలయంలో ఆందోళన చేస్తున్నారని కొలికపూడి ఘాటైన విమర్శలు చేశారు. మరొకవైపు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొలికపూడి కేశినేని చిన్నికి ఏపీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలతో కూడా సంబంధాలున్నాయని ఆరోపించడంతో ఇప్పుడు బెజవాడ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. అలాగే కేశినేని చిన్నిని విజయవాడ విజయ్ మాల్యా అని కూడా చాలా మంది పిలుచుకుంటారని కొలికపూడి అనడం కూడా నాని వర్గీయుల్లో ఆగ్రహం తెప్పిస్తుంది. ఇద్దరు నేతల కన్నా పార్టీకి ఎక్కువ డ్యామేజీ జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
Next Story

