Tue Mar 31 2026 14:33:42 GMT+0530 (India Standard Time)
TDP : కడప రెడ్డమ్మకు కుర్చీ మీద ఉన్న శ్రద్ధ.. కార్యక్రమంపై లేకపోయెనే
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి నిత్యం వివాదాలను తానే కొని తెచ్చుకుంటున్నారు

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి నిత్యం వివాదాలను తానే కొని తెచ్చుకుంటున్నారు. చూసే వారికి సయితం ఆమె చేసే రగడ ఏవగింపుగా మారుతుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఈ రెండేళ్లలో అనేక సార్లు కుర్చీ కోసం కొన్ని సార్లు, ప్రొటోకాల్ కోసం కొన్నిసార్లు అధికారులపై చిందులు తొక్కడం పార్టీతో పాటు మాధవిరెడ్డికి కూడా మైనస్ గా మారింది. మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన మాధవి రెడ్డి కుర్చీ కొట్లాట వదలిపెట్టడం లేదు. నిన్న మొన్నటి వరకూ కార్పొరేషన్ లో మేయర్ సురేష్ బాబు వేదికపై కుర్చీ వేయలేదంటూ ఆగ్రహించి ఆయనను పదవి నుంచి తొలగించేంత వరకూ నిద్రపోలేదు.
అధికారులతో వాగ్వాదం...
ఆగస్టు పదిహేనో తేదీన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అధికారులతో పేచీ పెట్టుకున్నారు. కడప పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైన మాధవి రెడ్డి వచ్చేసరికి వేదికపై కుర్చీ లేకపోవడంతో మరోసారి అధికారులపై చిందులు తొక్కారు ప్రొటోకాల్ ప్రకారమే అధికారులు, మంత్రులకు మాత్రమే చోటు ఉంటుందని ఉన్నతాధికారలుు చెప్పినా ఆమె వినలేదు. తనకు కుర్చీ వేయకపోవడంపై ఆమె అక్కడే ఉండి నిలబడి నిరసన తెలియజేశారు. అప్పుడు కూడా మీడియాలో హైలెట్ గా మారి ఇదేంది తల్లీ అని జనం అనుకునేలా చేశారు.
తాజాగా టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో...
తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్లను ఈరోజు చంద్రబాబు నాయుడు పేటలో ప్రారంభించారు. అయితే ప్రతి జిల్లాల్లో వేడుకగా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారు. కానీ మంత్రి సవిత తర్వాత తనను వేదికపైకి పిలవలేదని మైకు పుచ్చుకుని మరీ అక్కడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జాయింట్ కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్యక్రమం కంటే ఈ రెడ్డమ్మకు కుర్చీ ముఖ్యమని భావించి ఉండవచ్చు. ప్రొటోకాల్ కు భిన్నంగా వ్యవహరిస్తే నేరుగా స్పీకర్ కు ఫిర్యాదు చేయవచ్చు కానీ, సభలో రచ్చ చేయడం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభమేమటమ్మా? అని కొందరు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.
Next Story

