Sun Mar 29 2026 10:35:35 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : బంగారు గనులు తవ్వకానికి అంతా సిద్ధం
ఆంధ్రప్రదేశ్ లో బంగారు గనులు తవ్వకానికి అంతా సిద్ధమయింది

ఆంధ్రప్రదేశ్ లో బంగారు గనులు తవ్వకానికి అంతా సిద్ధమయింది. బంగారు గనుల తవ్వకం మొదలయితే ఏపీకి కూడా గోల్డ్ మైన్స్ జాబితాలో చేరనుంది. కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం జొన్నగిరిలో భారీ ఎత్తున బంగారు గనుల తవ్వకం ప్రాజెక్టుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మాదిరిగానే భారతదేశపు తదుపరి అతిపెద్ద బంగారు గనిగా ఆంధ్రప్రదేశ్ లోని జొన్నగిరి మైన్స్ ఆవిర్భవించనుంది. జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నేతృత్వంలో సాగుతున్న ఈ ప్రాజెక్టు, అత్యాధునిక సాంకేతికతతో దేశీయంగా బంగారు ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.
వేగంగా అనుమతులు...
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం వేగంగా ఇస్తున్న అనుమతులు , పారదర్శకమైన విధానాలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా నత్తనడకన సాగిన ఈ గనుల తవ్వకం అంశంపై, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మౌలిక సదుపాయాల కల్పన , అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇది కేవలం ఒక మైనింగ్ ప్రాజెక్టు మాత్రమే కాకుండా .. జాతీయ ప్రాధాన్యమున్న ప్రాజెక్టుగా గుర్తిస్తున్నారు. అందుకే వేగంగా అనుమతులు ఇవ్వడంతో వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి...
జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు ద్వారా సంవత్సరానికి దాదాపు 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరనుంది. అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో ఈ ప్రాంతం పారిశ్రామిక హబ్‌గా మారే అవకాశం ఉంది. ఈ గోల్డ్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో పెంచుతోంది. గనుల తవ్వకంలో పర్యావరణ నియమాలను పాటిస్తూనే, పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయడం ద్వారా రాష్ట్రం పెట్టుబడులకు నిలయంగా మారనుంది.
Next Story

